ఇండియన్ క్రికెట్ లో ముగిసిన మరో క్లాసిక్ ఇన్నింగ్స్.!

రహానే కెరీర్ ప్రత్యేకతలివే

Share this :

భారత టెస్టు జట్టు మాజీ వైస్ కెప్టెన్, క్లాసిక్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే(Ajinkya Rahane) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన తన సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానానికి ఆయన ముగింపు పలికాడు. ఈ విషయాన్ని రహానే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక భావోద్వేగ భరితమైన వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంటూ ‘క్యాప్ 278 సైనింగ్ ఆఫ్’ అని ప్రకటించాడు. తన రిటైర్మెంట్ వీడియోలో రహానే ఎమోషనల్‌ అయ్యాడు.

Also Read: భారత్ పై అబుదాబి కాసుల వర్షం.!

జీవితంలో ప్రతిదానికి ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంటాయని, సమయం వచ్చినప్పుడు దానిని గౌరవించి ముందుకు సాగాలని పేర్కొన్నాడు. తాను బ్యాటింగ్‌లో ఎల్లప్పుడూ టైమింగ్‌ను నమ్ముకున్నానని, అందుకే అంతర్జాతీయ క్రికెట్ మరియు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు వివరించాడు. చిన్న వయస్సులో కేవలం ప్రాక్టీస్ కోసమే ఎంతో దూరం ప్రయాణించిన రోజులను గుర్తు చేసుకుంటూ, క్రికెట్‌కు తన జీవితంలో సర్వస్వం ఇచ్చానని రహానే చెప్పాడు.

తన సుదీర్ఘ కెరీర్‌లో ఎల్లప్పుడూ దేశానికి, జట్టుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చానని మరియు ఎంతో నిజాయితీతో ఆటను ఆడానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశాడు. అజింక్యా రహానే కెరీర్‌లో అత్యంత గొప్ప ఘనత 2020-21 ఆస్ట్రేలియా టూర్. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేని సమయంలో, జట్టులో ఎంతో మంది కీలక ఆటగాళ్లు గాయపడ్డా.. రహానే తన అద్భుత నాయకత్వంతో యువ జట్టును నడిపించాడు. మెల్‌బోర్న్‌లో అద్భుత సెంచరీ చేయడంతో పాటు, ఆసీస్‌కు కరుడుగట్టిన కోట లాంటి ‘గాబ్బా’ స్టేడియంలో భారత్‌కు చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించి, కెప్టెన్‌గా తిరుగులేని ముద్ర వేశాడు.

రహానే భారత టెస్టు జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన 6 టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం ఆయన అసాధారణ కెప్టెన్సీకి నిదర్శనం. రహానే కేవలం బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్లలో ఒకడు. 2015లో శ్రీలంకతో జరిగిన గాల్ టెస్టులో ఒకే మ్యాచ్‌లో ఏకంగా 8 క్యాచ్‌లు పట్టి, ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రహానేకు స్వదేశం కంటే విదేశీ పిచ్‌లపైనే అద్భుతమైన రికార్డు ఉంది. లార్డ్స్, మెల్‌బోర్న్, డర్బన్, వెల్లింగ్టన్ లాంటి ప్రపంచంలోని అత్యంత కఠినమైన పిచ్‌లపై శతకాలు బాది, విదేశాల్లో భారత్‌ను ఎన్నో సార్లు ఆదుకున్నాడు.

Also Read: కర్ణాటక కాలేజీల్లో హెచ్ఐవీ టెర్రర్.!

సాంప్రదాయ క్రికెటర్ అయినప్పటికీ ఐపీఎల్‌లోనూ రహానే అద్భుతంగా రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా ఎన్నో క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడిన ఆయన, కెరీర్ చివరి దశలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ధోనీ నాయకత్వంలో టి20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా అత్యంత వేగంగా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రహానే చేసిన ఈ రిటైర్మెంట్ ప్రకటనతో భారత క్రికెట్‌లో ఒక సువర్ణ శకం, ఒక అద్భుతమైన క్లాసిక్ ఎరా ముగిసింది.