ప్రపంచ ఫుట్బాల్ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలుగొందుతున్న పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తన రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) తన కెరీర్లో దేశం తరఫున ఆడే చివరి ప్రపంచకప్ అని 41 ఏళ్ల రొనాల్డో స్పష్టం చేశాడు. స్పెయిన్ తో జరగబోయే అత్యంత కీలకమైన ‘రౌండ్ ఆఫ్ 16’ మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. “అవును, ఇదే నా చివరి వరల్డ్ కప్. ఈ టోర్నమెంట్లో ప్రతి క్షణాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఈ ప్రపంచకప్లో రొనాల్డో ఇప్పటికే 4 మ్యాచ్లలో 3 అద్భుతమైన గోల్స్ చేసి అదరగొట్టాడు. తన ఫామ్ మరియు వయస్సుపై వస్తున్న విమర్శలపై రొనాల్డో ఘాటుగా స్పందించాడు. “గత 23 ఏళ్లుగా నన్ను ఆట పరంగా ముగించేయడానికి (write me off) కొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నేను మునుపటిలా వేగంగా ఆడలేకపోతుండవచ్చు, కానీ మైదానంలో నా దేశం కోసం నా శక్తినంతా ధారపోస్తాను” అని చెప్పాడు. అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలోనే ఆరు విభిన్న వరల్డ్ కప్లలో గోల్స్ చేసిన ఒకే ఒక్క ఆటగాడిగా రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
అర్లింగ్టన్లోని ఏటీఆర్ అండ్ టీ (AT&T) స్టేడియంలో సోమవారం జరగబోయే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ జట్టుస్పెయిన్ తో తలపడనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా దూసుకుపోతున్నాయి. 2018 వరల్డ్ కప్లో స్పెయిన్ పై రొనాల్డో కొట్టిన చారిత్రాత్మక హ్యాట్రిక్ గోల్స్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్లో పోర్చుగల్ ఓడిపోతే, రొనాల్డోను వరల్డ్ కప్ జెర్సీలో చూడటం ఇదే చివరిసారి అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్బాల్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు.