కర్ణాటకలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో హెచ్ఐవీ (HIV) కేసులు కలకలం రేపుతున్నాయి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) మరియు కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు గల దాదాపు 7,000 మంది కాలేజీ విద్యార్థులు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఆరోగ్య నిపుణుల నివేదికల ప్రకారం, గత రెండేళ్లలో ఈ వయస్సు వారిలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
2023-24 నాటికి యువతలో కేసుల సంఖ్య కేవలం 44,500 ఉండగా, 2025-26 నాటికి అది ఏకంగా 66,600 దాటిపోయింది. అవగాహన లేకపోవడం, సురక్షితం కాని శారీరక సంబంధాలతో పాటు నేటి తరం యువతలో పెరుగుతున్న డ్రగ్స్ అలవాట్లే దీనికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఇంజెక్టబుల్ డ్రగ్స్ కోసం ఒకే సిరంజి లేదా నీడిల్‌ను ఒకరి కంటే ఎక్కువ మంది వాడటం వల్ల ఈ వైరస్ చాలా వేగంగా యువతలో విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన కర్ణాటక ప్రభుత్వం తక్షణమే అలర్ట్ అయింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మరియు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలతో పాటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తక్షణమే ‘ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపులు’ నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు ఉచితంగా హెచ్ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు మరియు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలను విద్యార్థుల పూర్తి ఇష్టపూర్వక అంగీకారం ఉంటేనే చేస్తామని, ఎవరిపైనా బలవంతం ఉండదని స్పష్టం చేసింది.
భయం లేదా సామాజిక అవమానం వల్ల పరీక్షలకు దూరంగా ఉండే వారి కోసం ప్రభుత్వం ‘నో యువర్ హెచ్ఐవీ స్టేటస్’ పేరిట ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులు తమ మొబైల్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, తమ వివరాలు బయట పెట్టకుండానే హెచ్ఐవీ రిస్క్ ఏంటో తెలుసుకోవచ్చు. ఒకవేళ పరీక్షల్లో పాజిటివ్ అని తేలినా, సదరు విద్యార్థి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచి, వారికి కావాల్సిన యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్సను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి