ఈ వయసులో పిల్లలకు ఫోన్ ఇస్తే మాటలు రావా..?

పిల్లలకు ఫోన్ ఇస్తే అంతే సంగతులు

Share this :

చిన్నారులు ఏడవగానే చాలామంది తల్లిదండ్రులు వారిని ఊరడించడానికి చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ పెట్టడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. అయితే, ఈ అలవాటు వల్ల పిల్లల భవిష్యత్తు ఎదుగుదలపై తీవ్రమైన, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయని బ్రిటన్‌కు చెందిన నాలుగు ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిశోధకులు తాజాగా నిర్వహించిన ఒక మైలురాయి లాంటి అధ్యయనంలో హెచ్చరించారు. రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు అసలు ఉద్దేశపూర్వకంగా స్క్రీన్ టైమ్‌ను (Screen Time) అలవాటు చేయకూడదని ఈ పరిశోధన స్పష్టం చేసింది.

Also Read: ఉగ్రవాదం ఉచ్చులో పాక్, పాలు పోసిన పాము కాటు..!

యూకేలోని ‘యాక్షన్ ఆన్ డిజిటల్ డివైజ్ ఇమ్మర్సివ్ కండిషన్స్ టీమ్’ చిన్నారుల్లో స్క్రీన్ వాడకంపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలను విశ్లేషించి అత్యంత సమగ్రమైన నివేదికను విడుదల చేసింది. ఈ వయసులో పిల్లలకు డిజిటల్ స్క్రీన్లను చూపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, వారి మెదడు ఎదుగుదల దెబ్బతినే ప్రమాదం ఉందని తేల్చింది. పరిశోధనలో తేలిన ప్రధాన ముప్పులు ఒకసారి చూద్దాం. నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం వల్ల పిల్లల్లో భాష నేర్చుకునే ప్రక్రియ నెమ్మదిస్తుంది. వారు కొత్త మాటలు మాట్లాడటానికి చాలా సమయం పడుతుంది.

ఏడుపు ఆపడానికి ఫోన్ అలవాటు చేయడం వల్ల, పిల్లలు ఓదార్పు కోసం తల్లిదండ్రుల వైపు కాకుండా డిజిటల్ డివైజ్‌లపై ఆధారపడతారు. ఇది వారి ఎమోషనల్ డెవలప్‌మెంట్‌ను దెబ్బతీస్తుంది. డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల చిన్న పిల్లల్లో నిద్ర తీవ్రంగా డిస్టర్బ్ అవుతుంది. అలాగే కంటి చూపుపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫోన్ చూస్తూ ఒకే చోట కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గి, చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశాలు ఎక్కువ.

Also Read: బంగారం ప్రియులకు శుభవార్త..!

యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ సీనియర్ లెక్చరర్ రాఫ్ క్లేటన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ స్వంత స్క్రీన్ వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, తెలియకుండానే పిల్లలకు కూడా ఈ అనారోగ్యకరమైన అలవాట్లను నేర్పుతున్నారని తెలిపారు. వీడియో కాల్స్ లేదా ఎడ్యుకేషన్ యాప్స్ వంటి పరిమిత స్క్రీన్ యాక్టివిటీస్ పర్వాలేదనే ప్రస్తుత ప్రభుత్వాల సలహాలను మార్చాలని, ఎందుకంటే ఇది తల్లిదండ్రులకు స్క్రీన్ వాడకం సురక్షితమేననే తప్పుడు నమ్మకాన్ని కలిగిస్తోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చిన్నారుల జీవితంలో మొదటి 1,001 రోజులు వారి మానసిక, శారీరక ఎదుగుదలకు అత్యంత కీలకమైనవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కాబట్టి డిజిటల్ యుగంలో మీ పిల్లల మెదడు సక్రమంగా ఎదగాలంటే వారికి స్మార్ట్‌ఫోన్లను వీలైనంత దూరంగా ఉంచడమే ఏకైక మార్గం.