ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇసుక అక్రమాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరపాలి అంటూ అప్పట్లో డిమాండ్ లు కూడా వినిపించినా ప్రభుత్వం మాత్రం దానిపై దృష్టి సారించలేదు. ఇక తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గట్టిగా ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన ఇసుక అక్రమ మైనింగ్‌పై అమరావతికి చెందిన దండా నాగేంద్ర కుమార్ గతంలోనే ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆయన కేసులు దాఖలు చేశారు. ఈ కేసుల ఆధారంగానే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇప్పుడు ఏపీలో ఇసుక మాఫియా గుట్టుమట్లను వెలికితీసేందుకు అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది. నాగేంద్ర కుమార్ అందించిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ఈ ఇసుక తవ్వకాల కాంట్రాక్టులు పొందిన ప్రతిమ ఇన్‌ఫ్రా, జైప్రకాష్ పవర్ వెంచర్స్, మరియు జీసికేసి ప్రాజెక్ట్స్ వంటి ప్రముఖ సంస్థలపై ఈడీ ప్రధానంగా నిఘా పెట్టింది.
ఈ సంస్థలు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి, భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 50 కింద నాగేంద్ర కుమార్ కు నోటీసులు జారీ చేసిన ఈడీ, సదరు కంపెనీల అక్రమ మైనింగ్‌కు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను సమర్పించాలని కోరింది. ఈ తాజా నోటీసుల నేపథ్యంలో, ఫిర్యాదుదారుడైన దండా నాగేంద్ర కుమార్ ఈరోజు ఈడీ అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన సమర్పించబోయే కీలక ఆధారాలు, డాక్యుమెంట్ల ఆధారంగా ఈ ఇసుక కుంభకోణంలో ఎవరెవరికి వాటాలు అందాయి, ఎంత మేర నిధులు పక్కదారి పట్టాయనే విషయాలపై ఈడీ తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ పరిణామంతో వైసీపీ నేతల్లో మరియు సదరు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి