ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు (Cabinet Shuffle) ముహూర్తం ఖరారవుతున్నట్లు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. పాలనను మరింత పరుగులు పెట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈసారి మంత్రుల పనితీరుపై ప్రత్యేకంగా గురిపెట్టారు. ప్రతి ఒక్క మంత్రి గ్రాఫ్‌ను, వారి శాఖల ప్రగతిని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా మంత్రుల పనితీరు, ప్రజల్లో వారికున్న ఆదరణ, శాఖలపై వారికి ఉన్న పట్టు తదితర అంశాలపై ఇంటెలిజెన్స్ మరియు ఐఏఎస్ అధికారుల ద్వారా రహస్య రిపోర్టులను తెప్పించుకుని చంద్రబాబు క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేస్తున్నట్లు సమాచారం.
కొందరు మంత్రులు తమ శాఖల నిర్వహణలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారని, ప్రజాసమస్యల పరిష్కారంలో వెనుకబడ్డారని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన శాఖలు కలిగి ఉండి కూడా వివాదాల్లో చిక్కుకుంటున్న వారు, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్న వారిపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసమర్థులను తప్పించి, యాక్టివ్‌గా ఉండే కొత్త శాసనసభ్యులకు అవకాశం ఇవ్వాలని, లేదా కొందరి శాఖలను మార్చడం ద్వారా కేబినెట్‌కు సరికొత్త జవసత్వాలు తీసుకురావాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైద్య కారణాల రీత్యా ముంబైలో ఉన్నారు. అక్కడ ఆయన ఒక చిన్నపాటి శస్త్రచికిత్స (సర్జరీ) చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ముంబైలో చికిత్స ముగించుకుని పవన్ కళ్యాణ్ ఏపీకి తిరిగి రాగానే.. సీఎం చంద్రబాబు ఆయనతో అత్యంత కీలకమైన భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇరు నేతలు మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులను ముందే ఉంచుకుని, జనసేన మరియు టీడీపీ కోటాలో ఎవరిని ఉంచాలి, ఎవరిని మార్చాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పవన్ రాకతోనే ఈ పొలిటికల్ సస్పెన్స్‌కు తెరపడనుండటంతో, మంత్రుల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి