కామన్వెల్త్ గేమ్స్ 2026 (CWG 2026)లో భారత అథ్లెట్లు తమ పతకాల పరంపరను కొనసాగిస్తున్నారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత స్టార్ మహిళా డిస్కస్ త్రోయర్ సీమా కాలిరమ్నా సంచలన ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఆమె 58.65 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచారు. ఈమె సాధించిన పతకంతో ప్రస్తుత కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 17కు చేరగా.. అథ్లెటిక్స్ విభాగంలో దేశానికి ఇది నాలుగో పతకం కావడం విశేషం.
హర్యానాలోని భివానీ జిల్లా దినోద్ గ్రామానికి చెందిన సీమా కాలిరమ్నా ప్రయాణం ఎందరికో ఆదర్శప్రాయం. ఓవైపు అంతర్జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా రాణిస్తూనే.. మరోవైపు 3 ఏళ్ల కుమారుడు రుద్రకు తల్లిగా, ఇంకోవైపు చౌదరి బన్సీలాల్ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ విద్యార్థినిగా ఆమె బహుముఖ పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్నారు. జాతీయ స్థాయి మాజీ డిస్కస్ త్రోయర్ అయిన ఆమె భర్త రవీందర్ (మోను కాలిరమ్నా) ఆమెకు పూర్తి స్థాయి కోచ్‌గా వ్యవహరిస్తూ నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో కుటుంబ సభ్యులు బాబు బాధ్యతలను చూసుకుంటూ సీమకు కొండంత అండగా నిలిచారు.
ఈ చారిత్రాత్మక పతక విజయం అనంతరం సీమా కాలిరమ్నా మాట్లాడుతూ.. ఈ కాంస్యాన్ని తన భర్త, కుటుంబ సభ్యులతో పాటు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI), సాయ్ (SAI), జేఎస్‌డబ్ల్యూ (JSW) సంస్థలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి కష్టకాలంలోనూ తన భర్త రవీందర్ తనకు తోడుగా నిలిచారని ఆమె కొనియాడారు. దేశం తరఫున అంతర్జాతీయ వేదికపై పతకం గెలవడమే తమ ఇద్దరి ఏకైక శ్వాస, ఆశయమని ఆమె భర్త రవీందర్ ఈ సందర్భంగా గర్వంగా వెల్లడించారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి