వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం చుట్టూ రాజకీయ, న్యాయపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది. వారిపై నమోదైన వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు చర్యల కోసం జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించారు. తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ లేదా రక్షణ కల్పించాలంటూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై స్పందించిన మహిళా కోర్టు.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.
జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం కోసం తన భర్త రాజీవ్, మామ జోగి రమేష్‌లతో పాటు అత్త, ఆడపడుచు తనను తీవ్రంగా వేధించారని, శారీరకంగా, మానసికంగా హింసించడమే కాకుండా తనపై హత్యాయత్నానికి కూడా ఒడిగట్టారని మేఘన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఏ క్షణమైనా తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఆందోళనతో జోగి రమేష్ కుటుంబం కోర్టు మెట్లు ఎక్కింది.
అయితే, ఈ మొత్తం వ్యవహారంలో జోగి రమేష్‌కు వైస్సార్‌సీపీ అధిష్టానం నుండి ఎలాంటి మద్దతు లభించడం లేదనే టాక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసు, అగ్రిగోల్డ్ భూముల వివాదంలో కుమారుడి అరెస్ట్ వంటి అంశాల్లో పార్టీ కొంతమేర స్పందించినప్పటికీ.. ఇది పూర్తిస్థాయి కుటుంబపరమైన, వరకట్న వేధింపుల కేసు కావడంతో పార్టీ లీగల్ సెల్ కానీ, అధినేత జగన్ కానీ దీనికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకే జోగి రమేష్ వ్యవహారంలో వైస్సార్‌సీపీ శ్రేణులు మౌనం వహిస్తున్నాయనే చర్చ బెజవాడ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి