అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు(Donald Trump) న్యాయస్థానంలో తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రముఖ రచయిత్రి, మాజీ మ్యాగజైన్ కాలమిస్ట్ ఈ. జీన్ క్యారల్ దాఖలు చేసిన లైంగిక వేధింపులు, పరువు నష్టం కేసులో ట్రంప్‌నకు ఫెడరల్ కోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. ఈ హైప్రొఫైల్ కేసులో ట్రంప్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. బాధితురాలికి భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలంటూ సంచలన తీర్పును వెలువరించింది. ఈ వివాదం దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటిది. 1996వ సంవత్సరంలో న్యూయార్క్‌లోని ఒక లగ్జరీ డిపార్ట్‌మెంటల్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో డోనాల్డ్ ట్రంప్ తనపై లైంగిక దాడికి (Sexual Abuse) పాల్పడ్డారని జీన్ క్యారల్ కోర్టును ఆశ్రయించారు.
అంతేకాకుండా, ఆ తర్వాత ఈ విషయాలను బయటపెట్టినందుకు ట్రంప్ తనపై అబద్ధాలాడుతోందంటూ సాషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, దీనివల్ల తన పరువుకు భంగం కలిగిందంటూ ఆమె పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు క్యారల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాధితురాలిని లైంగికంగా వేధించినందుకు, ఆమె ప్రతిష్టను దెబ్బతీసినందుకు గాను జీన్ క్యారల్‌కు రికార్డు స్థాయిలో 5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.41 కోట్లకు పైగా) నష్టపరిహారంగా చెల్లించాలని ఫెడరల్ కోర్టు ట్రంప్‌ను ఆదేశించింది.
అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ ట్రంప్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం పక్కన పెట్టేసింది. ట్రంప్ చేసిన వాదనల్లో ఎలాంటి పస లేదని పేర్కొంటూ ఆయన అప్పీల్‌ను పూర్తిగా తిరస్కరించింది. అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ట్రంప్‌నకు ఈ ఫెడరల్ కోర్టు తీర్పు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. చట్టపరమైన ఆంక్షలతో పాటు, నైతికంగా కూడా ఈ లైంగిక వేధింపుల కేసు తీర్పు ఆయన ప్రతిష్టను మసకబార్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై జీన్ క్యారల్ హర్షం వ్యక్తం చేయగా.. ట్రంప్ వర్గం మాత్రం ఈ తీర్పును రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణిస్తోంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి