టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్షలో సొమవారం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారు అని అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేత ధోరణిని భువనేశ్వరి తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులు ఏం చేసినా తమ బిడ్డలు బెదరరని, టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు. వేటికీ బెదరకుండా పోరాటం చేస్తున్న, అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదన్నారు. అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో చంద్రబాబును ఎవరూ మానసిక క్షోభకు గురిచేయలేరని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారన్నారు.
