Prof. Nageshwar: మేధావి పరువు తీసిన కట్టుకథ

రాజకీయ విశ్లేషకులలో ఆయనది సూపర్ స్టార్‌ రేంజ్

Share this :

పేరు కంటే ముందు ఆయనకు గౌరవం ఎక్కువ. వేల మంది విద్యార్థులకు చదువు చెప్పిన ప్రొఫెసర్. ఐఏఎస్‌, ఐపీఎస్‌లకూ విద్యా బోధన చేసిన గురువు.. రాజకీయ పార్టీలకు పొలిటికల్ పాఠాలు నేర్పించిన మేధావి.. వందల మంది పాత్రికేయులకు అవగాహన కల్పించారు. స్థానిక సమస్యల దగ్గర నుంచి జాతీయ, అంతర్జాతీయ అంశాల వరకు.. అడవిలో కష్టాల నుంచి ఆటంబాంబు వరకు ఎలాంటి ఇష్యూ అయినా సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా వివరించే విశ్లేషకుడు. నేషనల్‌ ఛానల్స్‌ కూడా ఆయన ఎనాలసిస్‌ కోసం ఎదురు చూస్తాయి. ఆయనే ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌.

తెలుగు మీడియాలో, రాజకీయ విశ్లేషకులలో ఆయనది సూపర్ స్టార్‌ రేంజ్.విషయ పరిజ్ఞానం చాలా ఉంది. ఏ విషయం అయినా సరే అనర్గళంగా మాట్లాడగలరు. అలాంటి ప్రొఫెసర్‌ నాగేశ్వర్.. ఏమైందో ఏమో గానీ.. ఒక్కసారిగా ఎవరెస్టు నుంచి పాతాళానికి పడిపోయారు. సూపర్‌ స్టార్‌ కాస్త.. జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో కమెడియన్ అయ్యారు కూడా. పవన్‌ కళ్యాణ్‌, అమిత్‌ షా మీటింగ్‌ అంటూ ఏదో అనేశారు. ఆ తర్వాత అదంతా కట్టుకథ అని తేలడంతో.. ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సింది వచ్చింది. ఆ తప్పుడు విశ్లేషణపై సోషల్‌ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రోలింగ్‌ జరిగింది. నిత్యం సోషల్‌ మీడియాలో కనిపించే ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ లాంటి వాళ్లకు ట్రోలింగ్‌ కొత్తేమీ కాదు.

కానీ యుద్ధం మీరు ప్రారంభించారు నేను ముగిస్తాను అని సవాల్‌ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. తెలంగాణ మేధావిని ఆంధ్ర వాళ్లు టార్గెట్‌ చేశారని మీడియా ముందు ఏడవడం మాత్రం ఇదే ఫస్ట్‌ టైమ్‌. పవన్‌ కళ్యాణ్‌ గరించి కట్టుకథలు క్రియేట్‌ చేసినప్పుడు.. నేను తెలంగాణ మేధావిని కదా.. ఆంధ్రా రాజకీయాలతో నాకెందుకు.. ఏపీ పొలిటీషియన్‌ గురించి నేనెందుకు మాట్లాడాలి అనుకోలేదు. కానీ ఆయన మీద కౌంటర్‌ పడే సరికి ప్రాంతాలు గుర్తుకొచ్చాయి. కేసుల భయం రావడంతో.. తెలంగాణ వాదం వెనుక దాక్కొని.. అందరి మీదా బాణాలు వేస్తున్నారు. ప్రాంతీయ వాదం భుజాల మీద తుపాకీ పెట్టి తూటాలు పేల్చాలని నానా పాట్లు పడుతున్నారు.

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ క్రియేట్‌ చేసిన ఫేక్‌ స్టోరీ మీదనే పవన్‌ కళ్యాణ్‌ గానీ.. జనసేన, తెలుగుదేశం సోషల్‌ మీడియాలు గానీ స్పందించాయి. ఎవరి ప్రయోజనాల కోసం ఇలాంటి కథలు చెబుతున్నారని ప్రశ్నించారు. పద్దతి మార్చుకోమని హెచ్చరించారు. అదే ఆయన ఏ కట్టుకథలు చెప్పకపోతే.. ఆయనను ఎవరూ ఏమీ అనేవాళ్లు కాదు కదా.. ఆయన జోలికి జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు కదా.

నేనేమైనా మాట్లాడతా.. ఎదురు ప్రశ్నిస్తే ఊరుకోను అంటున్న నాగేశ్వర్‌లో ఒక ప్రొఫెసర్‌, ఒక విశ్లేషకుడు కనిపించడం లేదు. గడీలో దొరలు.. ప్రజలను పట్టి పీడించే పాలెగాళ్ల మనస్తత్వం కనిపిస్తోంది. మీడియాలో సూపర్ స్టార్‌ రేంజ్‌ ఉన్నా.. ఆంధ్రా ప్రజల మీద ద్వేషం పెంచి రాజకీయ పబ్బం గడుపుకొనే పార్టీల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు లెవెల్‌కి దిగజారిపోయారని అనిపిస్తోంది. తన ఫ్లాప్‌ షోని ఇంతటితో ముగిస్తే మంచిదని ఆయన శ్రేయోభిలాషులు కూడా ఇప్పుడు ఆయనకు సూచనలు ఇస్తున్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమో.. మరెవరివో వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికో.. ఆడే ఆటలో పావులా మారాలని ఫిక్స్‌ అయితే ఎవరైనా చేయగలిగిందేమీ లేదు.

leave a reply