తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 సందడి మొదలైంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటూ కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ 7 పై ఆసక్తి రేకెత్తించారు. కింగ్ నాగార్జున సరికొత్త లుక్ తో తనదైన చమత్కారాలతో ఏడో సీజన్ చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఒక్కో కంటెస్టెంట్ ని పిలుస్తూ హౌజ్ లోకి పంపించారు. ఇక బిగ్ బాస్ తొలి కంటెస్టెంట్ గా టివి నటి ప్రియాంక జైన్ ఇంట్లోకి ప్రవేశించింది.
ఇక బిగ్ బాస్ సీజన్ 7 లోకి రెండవ కంటెస్టెంట్ గా ఒకప్పుడు హీరో, క్యారెక్టర్ పాత్రలతో అలరించిన నటుడు శివాజీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సింగర్ దామిని, శుభశ్రీ, షకీలా, ఆట సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ బిగ్‌బాస్ హౌసులోకి ప్రవేశించారు. నటుడు విజయ్ దేవరకొండ కొద్దిసేపు హౌజ్ లోకి వెళ్లి అలరించారు. మద్యలో ఇంటి సభ్యులకు ఓ టాస్క్ కూడా ఇచ్చారు నాగార్జున. ఇంటి సభ్యులకు కావాల్సిన ఫర్నీచర్ ని ఓపెన్ ప్లేస్ లోకి తీసుకు రావాల్సి ఉంటుంది. ఇందుకు న్యాయనిర్ణేతగా హీరో విజయ్ దేవరకొండ హౌజ్ లోకి వెళ్లాడు. ఈ టాస్క్ లో లాయర్ శుభశ్రీ గెలిచింది.
బిగ్ బాస్ సీజన్ 7 లోకి ప్రత్యేక అతిథులుగా విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఖుషి సినిమా ప్రమోట్ చేసుకునేందుకు హౌసులోకి విజయ్ దేవరకొండ రాగా.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కోసం నవీన్ వచ్చాడు. చివరిగా నవీన్ పోలిశెట్టి 15వ కంటెస్టెంట్ అంటూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత నాగార్జున వీక్ ఎండ్ లో కలుస్తా అంటూ సెలవు తీసుకున్నారు.
