తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి పట్ల తెలంగాణలోని సీమాంధ్రులు రగిలిపోతున్నారు. ఒక సీనియర్ నేత విషయంలో ఇలాంటి నిర్లక్ష్య వైఖరి విధానంపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే BRS వైఖరి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే వైఖరి కొనసాగితే ఇప్పటివరకు BRS కు మద్దతుగా నిలిచిన సీమాంధ్రులు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ అంశం ఆంధ్రలో ఇరు పార్టీల మధ్య ఘర్షణగా వర్ణించారు. ఇందుకు హైదరాబాద్ వేధిక కాకూడదని అన్నారు. అంతేకాదు ఎటువంటి నిరసనలు, ఆందోళనలు అనుమతించమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను జగన్ కు మద్దతుగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నాయని సీమాంధ్రులు భావిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాదులో ఆయనకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఐటి ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, వారిని ఇబ్బంది పెట్టడం, అరెస్టులు చేయడంతో ప్రభుత్వంపై అసంతృప్తి వెల్లువెత్తుంది. తమ ప్రియతమ నేత అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాదులోని ఐటి ఉద్యోగులు గత వారం రోజులుగా ఉద్యమిస్తున్నారు. విధులకు బహిష్కరించి ‘ఐ యాం విత్ సిబిఎన్’ అంటూ చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేస్తున్నారు. ఆందోళనలు, ఊరేగింపులు చేస్తున్నారు. ఈ విషయంలో BRS ప్రభుత్వం ఆందోళనలను అణచివేయడానికి ఉక్కు పాదం మోపుతోంది. ఆఫీసు టైంలో ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడమే కాకుండా వారికి సంబంధిత యాజమాన్యం ద్వారా నోటీసులు జారీ చేయిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఉన్న చంద్రబాబు హైదరాబాదులో చేసిన అభివృద్ధి కారణంగానే ఇప్పుడు BRS ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంటున్నారు. అంతర్జాతీయంగా హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందని వివరిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు అభివృద్ధి చేయకుంటే తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హైటెక్ సిటీని స్థాపించిన లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన చంద్రబాబు పట్ల BRS ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దీనిపైన స్పందించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేంద్ర జగన్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. చంద్రబాబును అక్రమ అరెస్టును ఎండగట్టారు. చంద్రబాబు అరెస్టు విషయంలో BRS అనుసరిస్తున్న వైఖరి పట్ల తెలుగు రాష్ట్రాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే BRS కు సీమాంధ్రులు దూరమయ్యే ఛాన్సు ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేక ధోరణి అవలంబిస్తూ, జగన్ కు బాసటగా నిలుస్తున్న BRS ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇప్పటికే సీమాంధ్రులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీమాంధ్రులలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో BRS కు ఓటు వేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు విషయంలో BRS ప్రభుత్వం ఇదే వైఖరిని అవలంబిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
