AP Elections 2024: ‘సీటు జారి గల్లంతైందే..’ వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుపై మల్లగుల్లాలు!

ఈ సారి వారందరికీ కష్టకాలమే! ఎవరు ఫట్‌.. ఎవరు సేఫ్‌.. ఫుల్ లిస్ట్‌ ఇదే

Share this :

కడప, అక్టోబర్‌ 3: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. రకరకాల సర్వేల పేరుతో ప్రజల నాడి పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. గెలుపులో పార్టీ బలం కొంత పనిచేస్తే.. అభ్యర్థి బలం మరికొంత పని చేస్తుంది. దీంతో ఎక్కడెక్కడ ఎవరెవరిని బరిలో దించాలో లెక్కలేసుకునే పనిలో పడ్డాయి పార్టీలు. సహజంగా అధికార పార్టీలో సీటు కోసం డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఏపీలో అధికార వైసీపీ (YSRCP MLAs)లో ఎమ్మెల్యేలపైన నిఘా మరీ ఎక్కువగా ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ (AP Elections 2024) తెప్పించుకుని క్లాస్ పీకుతున్నాడు సీఎం జగన్ (CM Jagan). పార్టీ ఇచ్చిన టాస్కులు చేయడంతో పాటు స్థానికంగా ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారనే ప్రాతిపదికనే మార్కులు వేస్తున్నారు. వాటి ఆధారంగానే సీట్ల (MLA Ticket Allotment) కేటాయింపు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించిన సమావేశంలో చాలా చోట్ల అభ్యర్థులను మార్చబోతున్నట్లు చెప్పకనే చెప్పాడు. సీటు రాని వాళ్లు నా వాళ్లు కాకుండా పోరంటూనే చావు కబురు చల్లగా చెప్పాడని చాలా మంది ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా సీట్లు తారుమారు అవుతాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి ఇప్పటికే పలుదఫాలుగా క్లాస్ పీకడంతో పాటు ప్రత్యామ్నయం చూపిస్తానంటూ చెప్పుకొస్తున్నాడట. పులివేందుల తప్ప ప్రతి నియోజకవర్గం (AP Assembly Constituency Seats)లో కూడా అల్టర్నేటీవ్ క్యాండిడేట్‌ను సిద్ధం చేసి ఉంచినట్లు సమాచారం.

జమ్మలమడుగులో సుధీర్ సీటు చినిగినట్లే…

కడప జిల్లాలో పులివెందుల తరువాత వైయస్ ఫ్యామిలీ ప్రభావం ఎక్కువగా ఉండే సీటు జమ్మలమడుగు. 2014 నుంచి వైయస్ ఫ్యామిలీ నిర్ణయించిన అభ్యర్ధులే గెలుస్తూ వస్తున్నారు. జగన్ పార్టీ వచ్చిన తరువాత కూడా 2014లో ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. తరువాత టీడీపీలోకి వెళ్లాడు. 2019 లో జమ్మలమడుగును చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్న జగన్ అన్ని రకాల వ్యూహాలతో ముందుకెళ్లారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి పోరాడిన డాక్టర్ సుధీర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. స్థానికుడు కావడంతో పాటు రాజకీయ కుటుంబ నేపధ్యం ఉండడంతో జగన్ సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చాడు. అయినా ఎక్కడా సీటు చేజారకుండా ఉండడం కోసం తమ్ముడు అవినాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి అన్నీ అతని చేతే నడిపించాడు. తనను కాదని వెళ్లిపోయిన ఆదినారాయణ రెడ్డి గెలవకూడదన్న పట్టుదలతో పని చేసిన సుధీర్ రెడ్డి చివరికి గెలిచాడు.

అయితే గెలచినప్పటి నుంచి సుధీర్ రెడ్డిపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనిలో మామూళ్లు తీసుకోవడంతో పాటు తోపుడు బండ్ల వాళ్ల దగ్గర కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనుషులు మామూళ్లు రాబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు లూజ్ టాక్ ఎక్కువగా చేస్తున్నట్లు గుర్తించిన జగన్ అక్కడి నుంచి వేరే అబ్యర్థిని బరిలో దించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అది కూడా తన ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకరిని పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడట. వివేకా హత్య కేసుతో ఎంపీ అవినాష్‌ రెడ్డిపై ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దానికి తోడు తాను ఎంపీ కావడంతో జాతీయ స్థాయిలో పార్టీ పరువుతోంది. దీంతో ఈ సారి కడప ఎంపీ సీటు మరో తమ్ముడు అభిషేక్ రెడ్డికి ఇచ్చి అవినాష్‌ను జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో దించాలని చూస్తున్నారట. ఇప్పటికే అవినాష్‌ జమ్మలమడుగులో వారం వారం ప్రజా దర్బార్ నిర్వహించి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. జమ్మలమడుగులో మరో ఈక్వేషన్ కూడా జగన్ వద్ద ఉందట. జగన్ భార్య భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారట. భారతి రాజకీయ ఆరంగెట్రానికి జమ్మలమడుగే సరైన వేదికని సీఎం జగన్ భావిస్తున్నారట.

Also Read: Chandrababu Naidu Arrest: అరెస్టు వెనుక అదృశ్య హస్తం? అక్టోబర్ 3పైనే ఆశలన్నీ?

ప్రొద్దుటూరులో రాచమల్లుకు ముళ్లకంపలు

రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా తనదైన శైలిలో పని తీరును కనబరుస్తున్నారు. తన కంటూ ఒక విజన్ తయారు చేసుకుని సందర్భానుసారంగా వాటికి నిధులు తెచ్చుకుని పనులు చేయిస్తున్నారు. సీటుకు ఢోకా లేకపోయినప్పటికీ వర్గ పోరు తీవ్రంగా ఉంది. పక్కనే ఉన్న కొత్త పల్లె పంచాయితీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డితో వర్గ పోరు తారా స్థాయిలో ఉంది. నియోజకవర్గంలో ఆ పంచాయితీ ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. దానికి తోడు బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్ కూడా రాచమల్లును వ్యతిరేకిస్తున్నారు. అయితే వీరి ప్రభావం రాచమల్లు ఎమ్మెల్యే సీటుపైన పడకపోయినా గెలుపుపైన మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు.

మైదుకూర్‌లో ఏజ్ బార్ ఎమ్మెల్యే.. మరో సారికి నో ఛాన్స్

మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మార్పు తప్పదంటున్నాయి పార్టీ వర్గాలు. రఘురామిరెడ్డికి వయోభారంతో పాటు అవినీతి ఆరోపణలు దండిగా ఉన్నాయి. ప్రతి పనిలో కమిషన్ అడగడంతో పాటు తన అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయన్న చర్చ నడుస్తోంది. రఘురామిరెడ్డికి సీటు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతుందన్న రిపోర్ట్ జగన్ దగ్గర ఉందట. కాబట్టి మార్పు తప్పదని చెబుతున్నారు. అదే జరిగితే ప్రొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ను కానీ, లేకపోతే మరో బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతను కానీ బరిలో దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

బద్వేల్‌లో సుధాకు శుభం కార్డు పడుతుందా..?

జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వుడు స్థానంలో బద్వేల్ ఒకటి. ఇక్కడ డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో ఆమె భార్య సుధాకు టికెట్టు ఇచ్చి ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నారు. పని తీరు విషయంలో ఆమెపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్న ఎమ్మెల్సీ గోవింద రెడ్డి కోరుకుంటే మాత్రం అభ్యర్థి మార్పు తప్పదంటున్నారు.

AP Politics: ‘రాష్ట్రంలో రాజ్యమేలుతున్న రెడ్డి సామాజిక వర్గం’ జగనన్నా.. సామాజిక సమతుల్యం ఎక్కడన్నా?

రాజంపేటలో మేడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతాడా…?

పొలిటికల్ లాబీయింగ్ చేయడంలో మేడా మల్లిఖార్జున రెడ్డి తరువాతే ఎవరైనా.. దానికి తోడు పార్టీల గెలుపు ఓటములను సరిగ్గా అంచనా వేసి ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీకి దగ్గరవుతాడు. తన సీటును పదిలం చేసుకుంటాడు. ప్రజల్లో తిరిగి తన శక్తి సామర్థ్యాలన్నింటినీ వాడి గెలుస్తాడు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాతో ముందుకెలుతున్నట్లు తెలుస్తోంది. రాజంపేట సీటు కోసం వైసీపీలో ఒకరిద్దరు ఆశావహులు ఉన్నప్పటికీ తనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నట్లు సమాచారం. వైసీపీలో రాజంపేట సిట్టింగ్‌ను మేడా తిరిగి నిలబెట్టుకున్నట్లే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.

రైల్వే కోడూర్‌లో కొరముట్లకు చుట్టూ కుంపట్లే..

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన రైల్వే కోడూరులో కొరముట్ల శ్రీనివాసులు వైసీపీ నుంచి వరుసగా మూడు సార్లు సీటు దక్కించుకున్నాడు. తాను గెలవడంతో పాటు పార్టీ కూడా గెలిచింది ఈసారే. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి మండలంలో బలంగా ఉండే రెడ్డి సామాజిక వర్గం నాయకులతో విభేదాలు ఉన్నాయి. వారంతా జగన్ వద్ద గట్టిగా లాబియింగ్ చేస్తున్నారు. కొరముట్లకు సీటు ఇస్తే తామంతా సహాయ నిరాకరణ చేస్తామంటూ హెచ్చరికలు పంపించారు. దీంతో కొరముట్లకు సీటు ఇస్తే చేజేతులా ఒక స్థానం కోల్పోతామన్న ఆలోచనలో ఉందట అధిష్టానం. దీంతో కోరుముట్లకు సీటు రాకపోవచ్చన్న చర్చ బలంగా జరుగుతోంది.

Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’

రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి సీటుకు ఢోకాలేదు..

శ్రీకాంత్ రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. వివాద రహితుడు. చాకచక్యంగా రాయచోటికి జిల్లా కేంద్రాన్ని తెచ్చుకోగలిగాడు. దీంతో ఆయన గ్రాఫ్‌ బాగా పెరిగింది. దానికి తోడు పార్టీలో రెండో లీడరే లేకుండా చేసుకోగలిగాడు. ఆయనను కాదని అధిష్టానం వేరేవారిని పెట్టాలన్న ఆలోచన చేసినా పెట్టడానికి వేరే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే లేకుండా చేశాడు. కాబట్టి శ్రీకాంత్ రెడ్డి సీటుకు ఎలాంటి ఢోకాలేదంటున్నారు నాయకులు.

కడపలో ఈ భాషా కాకపోతే ఇంకో భాషా..

వైసీపీకి ముస్లిం సామాజిక వర్గంలో బలం ఉంది. అందులోనూ కడపలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి సీటు అంటూ ఇస్తే ముస్లింలకే ఇస్తారు. అయితే అంజద్ భాషాకా.. లేదా వేరే భాషాకా అనే చర్చ గత కొంత కాలంగా నడుస్తోంది. రేసులో అప్జల్ ఖాన్‌తో పాటు , అహ్మదుల్లా కొడుకు పేర్లు వినిపిస్తున్నాయి. అంజద్ భాషాపై భూకబ్జాలు, సెటిల్‌మెంట్ల ఆరోపణలు ఉన్నాయి. వారి కమ్యునిటీలో కూడా ఆయనకు కొంత వ్యతిరేకత ఉంది. దీనిని అధిగమించాలంటే అభ్యర్థిని మార్చడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Also Read: Chandrababu Naidu Arrest: అరెస్టు వెనుక అదృశ్య హస్తం? అక్టోబర్ 3పైనే ఆశలన్నీ?