ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్కమ్ సర్టిఫికెట్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్షిప్లకు సంబంధించిన శాఖలు ఇకనుండి ఇన్కమ్ సర్టిఫికెట్ పత్రాలను అడగకూడదని ఉత్తర్వులు జారిచేసింది. అయితే దానికి బదులుగా గ్రామ, వార్డు సచివాలయాలు జారీ చేసే సర్టిఫికెట్ వీటికి సరిపోతుందని చెప్పింది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అడగడానికి బదులుగా అప్లై చేసిన మూడు రోజులలోగా ఆయా శాఖలు తమ తమ గ్రామ, వార్డు సచివాలయాల నుంచి సర్టిఫికెట్లను తెప్పించుకుంటే సరిపోతుందని అని కూడా చెప్పింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియ ఉన్నందువల్ల ఆ ధ్రువీకరణ ఆధారంగా జారీ అయ్యే సర్టిఫికెట్లను ఆదాయ ధ్రువపత్రాల స్థానంలో తీసుకోవాలిసినదిగా ఏపీ రెవెన్యూ శాఖకు ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. అయితే దీని ప్రకారం పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్షిప్లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తుది నిర్ణయంగా తెలిపింది.
మాములుగా ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఆరు దశల అంశాల ఆధారంగా ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీన్ని రియల్ టైమ్లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్వేర్ను వివిధ సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్వేర్లతో లింక్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ అవసరం కోసం అయితే ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది అనే విషయాన్ని గుర్తు చేసింది.
