‘ప్రజల సొమ్ముతో IPAC సిబ్బంది సోకులు’ రూ.274 కోట్ల స్కాంలో ప్రధాన పాత్రధారి జగనే: టీడీపీ నేత విజయ్ కుమార్

జగన్ సర్కార్ భారీ స్కామ్ ఇదేనంటూ టీడీపీ నేత విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు.. ఇందులో నిజమెంత?

Share this :

మంగళగిరి, అక్టోబర్‌ 4: ఎవరికీ తెలియకుండా.. ఎంతో తెలివిగా ఏడాదికి రూ.68 కోట్ల చొప్పున నాలుగేళ్లలో వాలంటీర్ల పేరుతో సీఎం జగన్ రూ.274 కోట్ల ప్రజలసొమ్ము దారిమళ్లించారని, సొంత పార్టీ ప్రచారం కోసం పనిచేస్తున్న ఐ ప్యాక్ సంస్థకు ఆ మొత్తం నిధుల్ని అప్పనంగా దోచిపెట్టినట్లు టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం (అక్టోబర్‌ 3) నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రూ.274కోట్ల సొమ్ము దారిమళ్లిన వైనాన్ని ఆయన వివరిస్తూ..

‘వాలంటీర్ల పర్యవేక్షణ పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీ అయిన ఐప్యాక్ (IPAC) సంస్థ సిబ్బందిని రాష్ట్రవ్యాప్తంగా జగన్ సర్కార్ నియమించింది. ఇందుకోసం మూడు షెల్ కంపెనీలను జగన్ రెడ్డి అండ్ కో ఒక కన్సార్టియంగా ఏర్పాటు చేశారు. ఆ మూడు షెల్ కంపెనీల్లో ప్రధానంగా వ్యవహరించిన కంపెనీకి ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు అందించారు. మళ్లీ అవే నిధుల్ని ఐప్యాక్ సిబ్బందికి జీతాల రూపంలో చెల్లించారు. మూడు షెల్ కంపెనీల్లో ముందుండి ఈ వ్యవహారం నడిపిన సంస్థ పేరు రామ్ ఇన్ ఫో. ఆ సంస్థకు జీవో ఇచ్చి మరీ ప్రభుత్వ ఖజానా నుంచి జగన్ సర్కార్ నిధులు చెల్లించింది. ఇలా నాలుగేళ్లలో దాదాపు రూ.274కోట్లు.. అంటే ఏటా రూ.68 కోట్ల చొప్పున చెల్లించిందన్నారు.’

ప్రభుత్వ సొమ్ముతో IPAC సోకులు

‘తెరచాటున జరిగిన ఈ వ్యవహారం మొత్తం గమనిస్తే ప్రభుత్వ సొమ్ముతో IPAC (ఐ ప్యాక్) సోకులు అని చెప్పొచ్చు. ఐప్యాక్ అనే సంస్థ అనేక రాష్ట్రాల్లో రాజకీయపార్టీల కోసం డబ్బులు తీసుకొని పనిచేస్తోంది. అలాగే ఏపీలో జగన్ సొంత పార్టీ వైసీపీ కోసం క్షేత్రస్థాయి నుంచే పనిచేస్తోంది. ప్రభుత్వంలో ఉన్నామనే ధైర్యంతో అలాంటి సంస్థకు జగన్ అండ్ కో అప్పనంగా ప్రజలసొమ్ముని దోచిపెట్టారు. వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో జిల్లాలవారీగా నియమించిన ఐప్యాక్ సిబ్బందికి ఈ విధంగా చెల్లింపులు చేశారు. ఈ నిధులు చెల్లించడం కోసం ప్రభుత్వం చెప్పిన మూడు షెల్ కంపెనీల్లో ఒక్క టే ప్రధానమైంది. రామ్ ఇన్ ఫో అనే సంస్థ మొత్తం వ్యవహారాలు చక్కబెడుతుంటే.. మిగిలిన రెండు కంపెనీలు అయిన ఉపాధి ఇన్ ఫో టెక్, మాక్స్ డిటెక్టివ్ సర్వీసెస్‌లు డొల్లకంపెనీలని’ విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Also Read: AP Elections 2024: ‘సీటు జారి గల్లంతైందే..’ వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుపై మల్లగుల్లాలు!

ఐప్యాక్ సిబ్బందికి డిటెక్టివ్ సర్వీసెస్ సంస్థ అయిన మాక్స్ సంస్థకు సంబంధమేంటి?

‘ఐ ప్యాక్ సిబ్బందిని వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోల్లో చాలా స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వ వాలంటీర్లపై పెత్తనాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నట్టు సదరు జీవీల ద్వారా చెప్పారు. ఏ రామ్ ఇన్ ఫో సంస్థకైతే ప్రభుత్వం వాలంటీర్లపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిందో.. వారంతా ఐప్యాక్ ఉద్యోగులే. 2020 జూన్ నుంచి ఇప్పటివరకు ఆ సంస్థ ఉద్యోగులని చెప్పబడుతోన్న ఐప్యాక్ విభాగం ఉద్యోగులకు రూ.200 కోట్లవరకు ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది చెల్లించాల్సింది కూడా కలిపితే మొత్తం రూ.274 కోట్లు అవుతుందని’ ఆయన అన్నారు.

ప్రభుత్వ వ్యవస్థ అయిన వాలంటీర్ల పర్యవేక్షణ భాద్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమే

‘రాష్ట్రంలోని వాలంటీర్లపై పర్యవేక్షణకు.. వారికి శిక్షణ ఇచ్చేందుకు.. ప్రత్యేకంగా ఒక సంస్థను నియమిస్తున్నట్టు, ఆ సంస్థ ఉద్యోగులు ఇకపై వాలంటీర్లపై నిఘా ఉంచుతారని తెలియజేస్తూ 2021, జూలై 29న అజయ్ జైన్ ఒక జీవో విడుదల చేశారు. ఆ జీవో ఇవ్వక ముందే ప్రభుత్వం నోటిమాటగా రామ్ ఇన్ ఫో సంస్థ సేవల్ని వాలంటీర్ల కోసం వినియో గించనున్నట్టు చెప్పింది. 2021లో ఇచ్చిన జీవోకి కొనసాగింపుగా వాలంటీర్లపై పర్యవేక్షణ బాధ్యతల్ని రామ్ ఇన్ ఫో, ఉపాధి ఇన్ ఫోటెక్, మాక్స్ సెక్యూరిటీ డిటెక్టివ్ ఏజన్సీ సంస్థలకు అప్పగిస్తున్నట్టు, అందుకోసం రూ.68,62,84,520లు చెల్లిస్తున్నట్లు తెల్పింది. ఇదంతా 2020 జూన్ నుంచే అమల్లోకి వచ్చినట్టు చెబుతూ పోస్ట్ ఫ్యాక్ట్ జీవో ఇచ్చారు. ఈ వ్యవహారానికి జగన్ సర్కార్ పెట్టిన ముద్దు పేరు FOA (ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ). తమసంస్థకు చెందిన 1061 మంది సిబ్బంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం నియమించినట్లు రామ్ ఇన్ ఫో సంస్థ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై పర్యవేక్షణ కోసమని చెప్పి, ప్రైవేట్ సంస్థ సిబ్బందిని నియమించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమే. ప్రజల సమాచారం మొత్తం వాలంటీర్ల ద్వారా సదరు ప్రైవేట్ సంస్థకు చేరుతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇదే జరుగుతోందని గతంలోనే తాము ఆధారాలతో సహా అనేక విషయాలు ప్రజల ముందు ఉంచామని’ విజయ్ కుమార్ గుర్తు చేశారు.

Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’

రామ్ ఇన్ ఫో సంస్థ సిబ్బందిగా చెబుతోన్న ఐప్యాక్ సిబ్బంది సేవల్ని వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం నియమిస్తూ జగన్ ప్రభుత్వం అధికారికంగా జీవో ఇవ్వకముందే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు. 2020, జూన్‌ 30న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి ఇచ్చిన ఉత్తర్వుల్లో.. దినేశ్ మోరే అనే రామ్ ఇన్‌ఫో సంస్థకు చెందిన అతను జిల్లాలోని వాలంటీర్ల పనితీరుని పర్యవేక్షిస్తారని, అతనికి జిల్లా యంత్రాంగం సహకరించాలని సూచిస్తూ ఆదేశాలు ఇచ్చారు. జగన్ సర్కార్ అధికారికంగా 2021 నుంచి రామ్ ఇన్‌ఫో సిబ్బందిని వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం నియమించినట్టు జీవో ఇస్తే, దానికి ముందే 2020లోనే జిల్లా కలెక్టర్లు ఈ విధమైన ఆదేశాలు ఎలా ఇచ్చారు? అంటే జగన్ సర్కార్ జీవో ఇవ్వకముందు నుంచే ప్రైవేట్ కంపెనీ సిబ్బందిని వాలంటీర్లపై పెత్తనం చేయడాని కి నియమించిందని సుస్పష్టమవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవోలు ఇవ్వకుండానే ప్రైవేట్ సంస్థను క్షేత్రస్థాయిలో రంగంలోకి దింపి, వారి సేవల్ని వాలంటీర్ల సేవలతో అనుసంధానించినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు.

రామ్ ఇన్‌ఫో సంస్థ సిబ్బంది, ఐ ప్యాక్ సిబ్బంది..వేర్వేరు కాదు.. ఒక్కరే!

రామ్ ఇన్‌ఫో సంస్థ సిబ్బందిగా చెప్పబడుతోన్న సిబ్బందిలో ఎక్కువమంది ఐప్యాక్ సంస్థలో పనిచేస్తున్నారు. వారిలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చెప్పిన దినేశ్ మోరే ఒకరు. వీళ్లంతా ఒక సంస్థలోనే ఉంటూ మరోసంస్థలో పనిచేస్తున్నట్టు లింక్డ్ ఇన్ వెబ్‌సైట్ సమాచారం ద్వారా తెలిసింది. దినేశ్ మోరే మాదిరే.. చైతన్య, ప్రవీణ్ లాంటి వారుకూడా ఇందులో ఉన్నారు. వీరందరి కంటే అగ్రస్థానంలో ఉన్న జయేశ్ , పూర్ణ దుర్గ, షర్మిలా రెడ్డి, కృష్ణ గోపాల్ ఛత్రాహి, హిమాంతి కుమార్ లాంటి వాళ్లు ఐప్యాక్‌లో 2018 నుంచే పనిచేస్తున్నారు. ఇలా రామ్ ఇన్‌ఫో సంస్థ, దాని అనుబంధ సంస్థ అయిన యూనికార్ప్ సొల్యూషన్స్‌, ఐప్యాక్‌లో పనిచేసే వాళ్లంతా ఒక్కటే.

ఐప్యాక్ సంస్థకు చెందిన సిబ్బందిని ముందే వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం నియమించిన జగన్ సర్కార్.. ఆ తర్వాత రామ్ ఇన్‌ఫో, ఉపాధి ఇన్‌ఫో టెక్, మాక్స్ డిటెక్టివ్ ఏజెన్సీ సంస్థలను కన్సార్టియంగా ఏర్పాటు చేసి, ఆ కన్సార్టియానికి వాలంటీర్లపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తర్వాత తీరుబడిగా జీవోలు ఇచ్చింది. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు కూడా చెల్లించింది. ఇదంతా ఎక్కడా బయటకు రాకుండా వైసీపీ సర్కార్ చాప కింద నీరులా మొత్తం వ్యవహారం చక్కబెట్టింది. ప్రజలసొమ్ముని ఐప్యాక్ సంస్థకు దోచిపెట్టి, సదరు సంస్థ ద్వారా తన పార్టీ, తన ప్రభుత్వం పొందిన లబ్ధి ఏమిటో జగన్ చెప్పాలని విజయ్ కుమార్ ప్రశ్నించారు.

మూడు సంస్థల్ని FOAగా చెప్పిన జగన్ సర్కార్ వాటి సేవల వినియోగం కోసం నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచిందా? టెండర్లు పిలిస్తే ఎల్-1, ఎల్-2, ఎల్-3 ఎవరు? రూ.274కోట్ల చెల్లింపులకు అసెంబ్లీ, కేబినెట్ అనుమతి ఉందా? రామ్ ఇన్ ఫో సిబ్బంది, ఐ ప్యాక్ సిబ్బంది ఒక్కటేనని ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం జీవో ఇవ్వకుండానే జిల్లా యంత్రాంగం రామ్ ఇన్ ఫో సిబ్బందికి ప్రభుత్వాధికారులు సహకరించాలని ఎలా ఆదేశాలిచ్చింది? అలా ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిసి కలెకర్ట్ స్థాయి అధికారులు ఏ ధైర్యంతో ఆదేశాలు ఇచ్చారు? ప్రభుత్వ ఉద్యోగులు రామ్ ఇన్‌ఫో సంస్థ సిబ్బందికి ఎలాంటి సమాచారం అందించా రు? అలా అందించిన సమాచారం ఎటుపోయింది? ఎవరి చేతుల్లోకి వెళ్లింది? ఆ సమాచారం మొత్తం ప్రైవేట్ సర్వర్లలో ఉందా? లేదా ప్రభుత్వ సర్వర్లలో ఉందా? ఈ ప్రశ్నలన్నింటిపై ముఖ్యమంత్రి తక్షణమే నోరు విప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.

Also Read: Chandrababu Naidu Arrest: అరెస్టు వెనుక అదృశ్య హస్తం? అక్టోబర్ 3పైనే ఆశలన్నీ?

వాలంటీర్ల సేవల పేరుతో ఓ ప్రైవేట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించి, అందుకోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు అందించడం ముమ్మాటికీ కుంభకోణమే. కాదని నిరూపించగల ధైర్యం ఈప్రభుత్వానికి ఉందా? రూ.274 కోట్ల చెల్లింపుల వ్యవహారంపై ఎలాంటి జీవోలు ఇవ్వకుండా జరపడాన్ని స్కామ్ అనక ఏమంటారు ? ఇంత అడ్డగోలుగా జనం సొమ్ముని తన స్వప్రయోజనాలు, తన పార్టీ ప్రయోజనాల కోసం ధారాదత్తం చేసిన జగన్.. ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేని, తప్పు జరిగినట్టు నిరూపించే రుజువులు లేని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో చంద్రబాబుని అకారణంగా దోషిని చేసే ప్రయత్నం చేయడాన్ని ఏమనాలి? ఏమీలేని దానిలో ఏదో జరిగిందని చెబుతోన్న ఈ నీతిమాలిన ప్రభుత్వం ప్రజల సొమ్ముని అప్పనంగా ఐప్యాక్ ఉద్యోగులకు దోచిపెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటుంది? తమ పార్టీ వారిని వాలంటీర్లుగా, ఐ ప్యాక్ సిబ్బందిగా చూపుతూ.. వారి సేవల్ని తన పార్టీకి వినియోగించుకుంటూ ప్రజల సొమ్ముని వారికి దోచిపెడుతున్నారు. ఇదొక్కటే కాదు.. ఇంకా చాలానే ఉన్నా యి. వాటిని కూడా త్వరలోనే బయటపెడతాం. ఇప్పుడు ప్రజలకు చెప్పింది ప్రజల సొమ్ముతో ఐప్యాక్ సంస్థ చేసిన సోకుల గురించే. త్వరలో చెప్పబోయేది ‘డిజిటల్ కార్పొరేషన్ సొమ్ములు.. వైసీపీ సోషల్ మీడియా సోకుల’ వ్యవహారం అని విజయ్ కుమార్ జగన్‌ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. దీనిపై అధికార పార్టీ స్పందన ఏవిధంగా ఉంటుందనేది చూడాలి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.