చిత్తూరు, అక్టోబర్ 10: రాష్ట్ర మంత్రి, వైసీపీ రాజకీయాలలో (AP Politics) ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన మంత్రి రోజా (Minister Roja) పైన తెదేపా (TDP) నేత బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana Murthy) చేసిన వ్యాఖ్యలపై ఆమెకు సొంత జిల్లాలో కానీ, సొంత పార్టీలో కానీ మద్దతు లభించడం లేదు. చిత్తూరు జిల్లా (Chittoor) ప్రజలు, నాయకులు, శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు రోజాకు మద్దతుగా మాట్లాడడం లేదు. అలాగే ఆమె సొంత పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీ MLAలు, మంత్రులు కూడా రోజాకు మద్దతుగా నిలవడం లేదు. రాష్ట్రంలో కూడా ఆమెకు మద్దతు లేదనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే బండారు సత్యనారాయణమూర్తి రోజా పైన చేసిన వ్యాఖ్యలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, అధికార పార్టీ కానీ చాలా తేలిగ్గా తీసుకున్నారు. దానిపైన స్పందించడానికి ఎవరు ముందుకు రావడం లేదు.
Also Read: ‘Yatra 2’ first look: ‘యాత్ర 2’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి..’
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజా వివాదాల సుడిగుండంలో కూరుకుపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఆమె కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆమె మీద పదునైన, పరుషమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. జబర్దస్త్ రోజా అంటూ అవహేళన చేస్తున్నారు. ఆమె సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు నటించిన కొన్ని సినిమాల్లోని అర్ధ నగ్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కన్నీటి పర్యంతరం అయ్యారు కూడా. అయినా సొంత నియోజకవర్గంలో కానీ, సొంత జిల్లాలో గాని ఏ ఒక్కరూ రోజాకు అండగా నిలవలేదు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్ కానీ, ప్రధాన సలహాదారు సజ్జల గాని, మంత్రులు కానీ, తెలుగుదేశంపైన విమర్శలు గుప్పించే కొడాలి నాని, అంబటి రాంబాబు కూడా ఈ విషయంలో కలగజేసుకోలేదు. కనీసం రోజాకు మద్దతుగా కూడా నిలవలేదు, సానుభూతి కూడా ప్రకటించలేదు.
రాజకీయాలలో మంత్రి రోజా ప్రవర్తన రోజురోజుకూ వివాదాస్పదమవుతుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా, దానికి దీటుగా రోజా స్పందిస్తున్నారు. వారు కూడా అంతే దీటుగా రోజాను నైతికంగా ఇరుకున పెడుతున్నారు. రోజాను ఇరుకున పెడుతుంటే సొంత పార్టీ నేతలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కనీసం ఆమెకు మద్దతుగా నిలవడం లేదు. మనసులో రోజాకు బాగా అయ్యిందని సంబరపడుతున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది సినీ నటుల చేత రోజా తనకు మద్దతుగా స్టేట్‌మెంట్లను ఇప్పిస్తోందని, వాటిల్లో పస లేదని అంటున్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ కు చెందిన నవనీత్ కౌర్, తమిళనాడుకు చెందిన కుష్బూ, ఇదివరకు సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ, మీనాలు తెదేపా నేత బండారు నారాయణ వ్యాఖ్యలను ఖండించారు. క్షమాపణలు చెప్పాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో కలుగ చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం.. అప్పుడు భార్య ఇప్పుడు..
మంత్రి రోజా మీద బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై రోజా ఏడవడంతో ఎవరిలోనూ సానుభూతి కలిగించలేదని తెలుస్తోంది. మొదటి నుంచి నటి రోజా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం, తనకు రాజకీయ బిక్షం పెట్టిన తెలుగుదేశం పార్టీని, వారి కుటుంబ సభ్యులను నీచాతి నిజంగా మాట్లాడడం చేస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఏమన్నా పడాలని, మా నాన్నను, అమ్మను, చెల్లిని అన్నారని వ్యంగ్యంగా రోజా అనడాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అవమానపరిచినప్పుడు మహిళల పట్ల గౌరవం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. అలాగే తనకు సినీ రంగ ఎదుగుదలకు తోడ్పడిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులను, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన భార్యలను గురించి రోజా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు మహిళల హక్కులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నా, ఇతర రంగంలో ఉన్నా, ఎవరూ తన పరిధిని అతిక్రమించకూడదని అంటున్నారు. ఒక మహిళగా “అది, ఇది, వాడు, వీడు, కొజ్జా, తేల్చుకుందాం, చూసుకుందాం, నన్నేమైనా రేప్ చేస్తారా ?” అనే పదాలను ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రోజా ప్రవర్తనను తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి NB సుధాకర్ రెడ్డి, జనసేన పార్టీకి చెందిన కిరణ్ రాయల్ చీల్చి చెండాడుతున్నారు. నీ భాగవతం ఎవరికి తెలియదంటూ ఎద్దేవా వేస్తున్నారు. మొదటినుంచి నోరు అదుపులో పెట్టుకుని ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా! అని ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళగా, బిడ్డల తల్లిగా, భర్త చాటు భార్యగా కొన్ని హద్దులు ఉంటాయని, వాటిని అధిగమించి మగరాయుడిలా మాట్లాడడం ఈ దేశ సంస్కృతి, సంస్కారం అంగీకరించదని అంటున్నారు. తొలి నుంచి సినిమా నటులు అంటే సమాజంలో కొంత చులకన భావం ఉంది. వాటిని రోజా నిజం చేస్తున్నారా? అన్నట్లు ఆమె ప్రవర్తన ఉందని విశ్లేషిస్తున్నారు.
Also Read: Ticket Tension to YSRCP MLA’s: వైసీపీ ఎమ్మెల్యేలలో టిక్కెట్ల టెన్షన్.. ఈసారి వస్తుందో? రాదో?
రోజాకు సొంత పార్టీలోనే కాకుండా, సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో భారీ వ్యతిరేకత ఉంది. గతంలో నగరికి CM జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మంత్రి రోజా లేకుండా పెద్ద పెద్ద హోర్డింగులు వెలిసాయి. అలాగే స్థానిక నేతలకు రోజాకు విభేదాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో రోజాను ఎలాగైనా ఓడించి తీరుతామని స్థానిక నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈసారి టిక్కెట్టు రాకుండా చూడ్డానికి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, నారాయణ స్వాములకు కూడా రోజా మిద సానుభూతి లేదు. రోజాకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యతిరేకత కారణంగా రోజా రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. కావున రానున్న ఎన్నికల్లో తిరిగి టిక్కెట్లు దక్కించుకోవడానికి, ఒకవేళ ఓడిపోతే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఉన్నత పదవిని అలంకరించడానికి రోజా ఇప్పటి నుంచి పథకం ప్రకారం విమర్శలు చేస్తూ, అధినాయకత్వం దృష్టిలో పడడానికి నానా అగచాట్లు పడుతున్నారని పలువురు భావిస్తున్నారు. ఆ విమర్శలు శృతిమించడంతో తిరిగి రోజా వద్దకే చేరుతున్నాయి. రోజా వ్యక్తిగత ప్రతిష్ట, కుటుంబ ప్రతిష్ట మంటగలుస్తున్నాయి. ఇప్పటికైనా రోజా నోటిని అదుపులో పెట్టుకొని మిగిలిన మహిళా ఎమ్మెల్యేలు మంత్రులు మాదిరి ప్రవర్తించడం నేర్చుకోవాలని పలువురు నెటిజన్లు ఆమెకు హితం చెబుతున్నారు. లేకుంటే భవిష్యత్తులో రాజకీయంగా సమాధి తప్పదని హెచ్చరిస్తున్నారు.

Comments are closed.