ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు తాడేపల్లి పునాదులను తాకుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితులైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి నేతల ఇళ్లలో ఈడీ దాడులు జరగడం కేవలం యాదృచ్ఛికం కాదు. గత ఐదేళ్లలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కేంద్రంగా జరిగిన వేల కోట్ల రూపాయల లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి ఈడీ ఇప్పుడు ‘మనీ ట్రైల్’ అనే సాంకేతిక వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ఈ కేసులో ఈడీ ప్రధానంగా డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలపై దృష్టి పెట్టింది. నిందితులు వాడిన మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల నుంచి డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయడానికి అధునాతన సాఫ్ట్వేర్లను వాడుతున్నారు. ముఖ్యంగా మద్యం బ్రాండ్ల ఎంపిక, కమీషన్ల ఖరారుకు సంబంధించి తాడేపల్లి పెద్దలతో జరిగిన వాట్సాప్, సిగ్నల్ మరియు టెలిగ్రామ్ చాట్లను ఈడీ ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. ఈ చాటింగ్స్‌లో వాడిన ‘కోడ్ లాంగ్వేజ్’ను విశ్లేషించడం ద్వారా నిధులు ఎక్కడికి మళ్లాయో ఈడీ ఒక పక్కా మ్యాప్‌ను సిద్ధం చేసింది.
మరో కీలక అంశం ఏమిటంటే.. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులను కావాలనే నిలిపివేసి, కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు జరపడం. ఇలా సేకరించిన లక్షల కోట్ల రూపాయల నగదును బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాకుండా, ప్రత్యేకమైన ‘క్యాష్ లాజిస్టిక్స్’ ద్వారా హవాలా నెట్‌వర్క్‌కు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నగదును విదేశాల్లోని షెల్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మార్చడం లేదా ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి మళ్లించడం వెనుక ఉన్న టెక్నికల్ లింకులను దర్యాప్తు సంస్థలు వెలికితీస్తున్నాయి.
తాడేపల్లి ప్యాలెస్ సన్నిహితులైన ధనుంజయ రెడ్డి, రాజ్ కేసీ రెడ్డి వంటి వారి పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న పలువురు ఐఏఎస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా తాడేపల్లి వైపు వేలెత్తి చూపుతున్నాయి. ఒక ప్రభుత్వ విధానాన్నే మార్చి, నిబంధనలకు విరుద్ధంగా మద్యం సిండికేట్లకు లాభం చేకూర్చడం వెనుక ‘క్విడ్ ప్రో కో’ జరిగిందని ఈడీ బలంగా నమ్ముతోంది.
ప్రస్తుతం జరుగుతున్న ఈ సోదాలు మరియు సాంకేతిక ఆధారాల సేకరణ పూర్తయితే, తదుపరి అడుగు నేరుగా తాడేపల్లి కోటలోని ప్రధాన వ్యక్తులకు నోటీసులు ఇవ్వడమేనని ఢిల్లీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. నిందితుల ఫోన్ల నుంచి రికవరీ చేసిన ఆడియో క్లిప్స్ మరియు హవాలా ఏజెంట్ల స్టేట్మెంట్లే ఈ కేసులో కీలక మలుపు కానున్నాయి. మరి ఈ ‘ఆపరేషన్ లిక్కర్’ సెగ నుంచి తాడేపల్లి పెద్దలు ఎలా బయటపడతారన్నది ఇప్పుడు సంచలనంగా మారింది.
