Summer Heat: తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ సెగ..? గుడ్ల కొరత తప్పదా..?

తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ సెగ..?

Share this :

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వణికిస్తున్న రికార్డు స్థాయి భానుడి భగభగలు ఇప్పుడు పౌల్ట్రీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసాయి. ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, తెలంగాణాలోని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో ఎండ తీవ్రత తట్టుకోలేక వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గతంలో వచ్చిన బర్డ్‌ఫ్లూ మహమ్మారి కంటే ఈ తాజా ఎండల తీవ్రత తమకు ఎక్కువ నష్టం కలిగిస్తోందని పౌల్ట్రీ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఎండల సెగకు ఫారాల్లోని కోళ్లు గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుండటంతో వ్యాపారులు కోట్లాది రూపాయల నష్టాలను చవిచూస్తున్నారు. ఈ భయంకరమైన వాతావరణ మార్పుల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ చికెన్ మార్కెట్ పూర్తిగా అతలాకుతలమైంది. ఎండ తీవ్రతకు చిన్న బ్రాయిలర్ కోళ్లు అసలు దొరకడమే లేదని వ్యాపారులు చెబుతున్నారు. వేడి వాతావరణం వల్ల కోళ్లు సజావుగా మేత తినకపోవడం, బరువు పెరగకపోవడంతో మార్కెట్లో బ్రాయిలర్ కోళ్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

దీనికి తోడు రవాణా సమయంలో వేడి గాలి తగిలి మార్గమధ్యంలోనే కోళ్లు చనిపోతుండటంతో సరఫరా దారుణంగా పడిపోయింది. మరోవైపు, ఎండ తీవ్రత ప్రభావం గుడ్ల ఉత్పత్తిపై కూడా తీవ్రంగా పడింది. విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల లేయర్ కోళ్లు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోవడంతో రోజువారీ గుడ్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలో తీవ్రమైన గుడ్ల కొరత (Egg Shortage) వచ్చే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా గుడ్ల సరఫరా లేకపోతే రాబోయే రోజుల్లో గుడ్ల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది.

leave a reply