విదేశాలకు ప్రయాణించాలనుకునే భారతీయ పౌరులకు అంతర్జాతీయ వేదికపై కొంత నిరాశ ఎదురైంది. ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్ పవర్‌ను అంచనా వేసే ప్రసిద్ధ ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ (Henley Passport Index) జూలై 2026 ఎడిషన్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ తాజా జాబితాలో భారతీయ పాస్‌పోర్ట్ గత మే నెలలో ఉన్న 78వ స్థానం నుండి రెండు స్థానాలు దిగజారి 80వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ 75వ స్థానానికి ఎగబాకినప్పటికీ, తాజా అప్‌డేట్‌లో మళ్లీ వెనుకబడటం గమనార్హం.
భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ పడిపోయినప్పటికీ, భారతీయులకు లభించే ఉచిత ప్రయాణ సదుపాయాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ప్రకారం.. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా (Traditional Visa) లేకుండానే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు హ్యాపీగా ప్రయాణించవచ్చు. ఇతర దేశాలు కొత్తగా అంతర్జాతీయ ప్రయాణ ఒప్పందాలు చేసుకోవడం వల్ల అవి రేటింగ్‌లో ముందుకు వెళ్లాయని, అందుకే భారత్ స్థానం స్వల్పంగా తగ్గిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారతీయులు ముందస్తు వీసా లేకుండా వెళ్లగలిగే 56 గమ్యస్థానాలలో పూర్తి వీసా రహిత (Visa-Free), వీసా ఆన్ అరైవల్ (Visa-On-Arrival), మరియు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) సదుపాయాలు ఉన్నాయి.
పూర్తి వీసా రహిత దేశాలు (Visa-Free): మలేషియా, థాయిలాండ్, మారిషస్, భూటాన్, నేపాల్, ఫిజీ, జమైకా, కజకిస్తాన్, అంగోలా, ఫిలిప్పీన్స్, మకావు తదితర దేశాలు.
వీసా ఆన్ అరైవల్ దేశాలు (Visa-On-Arrival): మాల్దీవులు, ఇండోనేషియా, శ్రీలంక, ఖతార్, జోర్డాన్, కాంబోడియా, లావోస్, మయన్మార్, జింబాబ్వే, టాంజానియా లాంటి దేశాలు.
ETA దేశాలు: కెన్యా, సీషెల్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్.
గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లోనూ వెనకే..:
కేవలం ప్రయాణ సౌలభ్యాన్ని మాత్రమే కాకుండా.. దేశంలో పెట్టుబడి అవకాశాలు, జీవన ప్రమాణాలు (Quality of life) వంటి విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్’ సంస్థ ఇచ్చే ‘గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026’ లో కూడా భారత్ వెనుకబడింది. ఈ ఇండెక్స్ ప్రకారం మొత్తం 200 దేశాలలో భారత్ 125వ స్థానంలో నిలిచింది. ఇతర దేశాలు తమ అంతర్జాతీయ కనెక్టివిటీని వేగంగా విస్తరించుకుంటున్న తరుణంలో భారత పాస్‌పోర్ట్ గ్లోబల్ మొబిలిటీ స్కోర్‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి