భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై ‘హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్’ (H-FAST) తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. జీహెచ్ఎంసీ (GHMC) మరియు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్తో కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ తనిఖీలు నగరవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం గత 100 రోజుల్లోనే H-FAST బృందం ఆహార కల్తీకి పాల్పడుతున్న వివిధ హోటళ్లు, తయారీ కేంద్రాలపై ఏకంగా 185 క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉక్కుపాదం మోపింది. వీటితో పాటు నిబంధనలు ఉల్లంఘించిన మరో 247 కేసులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జీహెచ్ఎంసీ, ఆహార భద్రతా విభాగానికి బదిలీ చేసింది.
ఈ మెరుపు దాడుల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఏకంగా 121.87 టన్నుల నిల్వ ఉంచిన, నాణ్యత లేని, రసాయనాలతో కూడిన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గ్రేటర్ పరిధిలో విస్తృతంగా జరిగిన ఈ తనిఖీల్లో అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్ పరిధిలోనే 55 ఆహార కల్తీ కేసులు నమోదు కావడం గమనార్హం. హోటళ్ల కిచెన్లలో కనీస శుభ్రత పాటించకపోవడం, కుళ్ళిపోయిన మాంసం, సింథటిక్ రంగులను వాడుతుండటాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు.
నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్న ప్రతి హోటల్, బేకరీ, రెస్టారెంట్‌కు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (FSSAI) లైసెన్స్ ఉండటం చట్టప్రకారం తప్పనిసరి అని H-FAST అధికారులు గట్టి ఆదేశాలు జారీ చేశారు. వ్యాపార ప్రాంగణాల్లో మరియు వంట గదుల్లో ఈసీ (EC) నిబంధనల ప్రకారం పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో సీజ్ చేయడమే కాకుండా భారీ జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీకి పాల్పడే వారిపై ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి