Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై వేలల్లో క్రిమినల్‌ కేసులు.. అన్ని హైకోర్టుల్లో సత్వర విచారణకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

శిక్షపడిన ప్రజాప్రతినిధులకు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం?

Share this :

Supreme Court Guidelines to HCs న్యూఢిల్లీ, నవంబర్‌ 10: ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల (Criminal Cases) విచారణలను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవల్సిందిగా అన్ని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేసుకోవల్సిందిగా హైకోర్టులు, జిల్లా జడ్జీలు, ప్రత్యేక న్యాయస్థానాలకు సూచించింది. అయితే అన్ని రాష్ట్రాలకు ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 

పార్లమెంటు సభ్యులు (MPs), శాసనసభ సభ్యులు (MLs)పై నమోదైన క్రిమినల్‌ (Criminal Cases on MLAs and MPs) కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం (నవంబర్‌ 9) సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Chief Justice of India DY Chandrachud) జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టులకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: Crime News : 8 ఏళ్ల క్రితం విద్యార్థితో శృంగారం.. టీచరమ్మ అరెస్ట్‌!

చట్టసభ్యులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఇవే..

* ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనం ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. క్రిమినల్‌ కేసుల సత్వర విచారణకు అవసరమైన పర్యవేక్షణ కోరుతూ సుమోటో కేసులు నమోదు చేయాలని హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది. అత్యవసరమైతే తప్ప ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలు వాయిదా వేయకూడని ట్రయల్‌ కోర్టులను ఆదేశించింది.

* మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించదగిన ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులు, ఐదేళ్లు అంతకంటే ఎక్కువ యేళ్లు జైలు శిక్ష విధించ గలిగిన కేసులను అత్యవసరమైతే తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రయల్ కోర్టు వాయిదా వేయకూడదు. స్టే ఇచ్చిన కేసులను ప్రధాన న్యాయమూర్తి జాబితా చేయవచ్చు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జిలను నియమించబడిన కోర్టులకు తగిన మౌలిక సదుపాయాలు, సాంకేతిక వనరులను కల్పింంచే దిశగా సెషన్స్‌ జడ్జి చర్యలు తీసుకోవాలని కోరింది.

* ప్రత్యేక కోర్టులకు అంశాల వారీగా కేసులను కేటాయించే బాధ్యతలను చూడాల్సిందిగా జిల్లా, సెషన్స్‌ జడ్జిని హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం కోరవచ్చు. కేసుల విచారణ పురోగతిపై నిర్ణీత వ్యవధుల్లో నివేదికలు పంపించాలని ఆదేశించవచ్చని పేర్కొంది.

* కేసు ఫైల్‌ చేసిన సంవత్సరం, పెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్ కేసుల సంఖ్య, విచారణల దశ వంటి తదితర వివరాలను సేకరించి హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యేక ట్యాబ్‌ ఏర్పాటు చేసి అందులో పొందుపరచాలని సూచించింది.

* సంబంధిత కేసులను ప్రత్యేక బెంచ్ త్వరితగతిన విచారించేటప్పుడు అవసరమైన ఆదేశాలు జారీ చేయవచ్చు. ప్రజాప్రతినిధులు, పబ్లిక్ సర్వెంట్లు, చట్ట సభ్యులకు సంబంధించిన క్రిమినల్ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని తెల్పింది.

ప్రజాప్రతినిధులపై కేసుల వేగవంత విచారణ, కోర్టు విచారణలో దోషులుగా తేలిన ఎంపీలు/ఎమ్మెల్యేలు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో మొదటి అంశాన్ని కొట్టివేయగా, రెండో అంశాన్ని సుప్రీంకోర్టు పెండింగ్‌లో ఉంచింది. పిటిషనర్ తన పిటిషన్‌లో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను సవాల్ చేశారు. జైలు శిక్ష అనంతరం విడుదలైన ప్రజాప్రతినిధులపై ఆరేళ్లపాటు అనర్హత విధించాలని, అలాగే అవినీతికి పాల్పడినట్లు రుజువైన ప్రభుత్వ ఉద్యోగులను ఐదేళ్ల వరకు డిస్మిస్‌ చేయాలని కోరారు. అయితే ఈ అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని కోర్టు చెప్పింది. నేర నేపథ్యం ఉన్న నేతలు రాజకీయాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఎప్పటి నుంచో సుప్రీంకోర్టుకు వినతులు వస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: Vyooham Movie Trailer Row: ఎంతకూ తెగని ‘వ్యూహం’ పంచాయితీ.. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ‘వ్యూహం’ ట్రైలర్‌పై ఫిర్యాదు

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై 2022 నవంబరు నాటికి 5,175 కేసులు ఏళ్ల తరబడి అపరిష్కృతం  కాకుండా పెండింగ్ లో ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. వీటిల్లో 2,116 కేసులు 5 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ కేసుల సత్వర విచారణ వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ కేసులు దేశ రాజకీయలు, ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ట్రయల్‌ కోర్టుల్లో జరుగుతున్న విచారణలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, జాప్యాన్ని నివారించేలా తక్షణమే తగిన సూచనలు చేయడానికి హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. కాగా మరో 6 నెలల్లో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని తాజా జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.