Delhi liquor Scam: బీఆర్‌ఎస్‌పై బీజేపీ డేగ కన్ను.. కవిత అరెస్ట్ తప్పదా?

తెలంగాణలో ఎంపీ సీట్లు గెలవాలంటే కవిత అరెస్టే బీజేపీ బ్రహ్మాస్త్రం

Share this :

Delhi liquor Scam హైదరాబాద్‌, డిసెంబర్‌ 8: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Elections) ముగిశాయి. భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్‌ ముఖ్యమంత్రి (TS CM Revanth Reddy)గా రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లు పాలించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ (BRS) చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 119 స్థానాలకు గానూ కేవలం 39 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ (Congress) 65 స్థానాలతో గెలుపుబావుటా ఎగురవేసింది. ఇక బీజేపీ (BJP) 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక మునుముందు రోజుల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కనుమరుగు కావడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కల్వకుట్ల కవిత అరెస్ట్‌ తప్పదా?

బీజేపీతో చేతులు కలిపి లిక్కర్ స్కామ్‌లో కూతురు కవిత అరెస్ట్‌ (Kalvakuntla Kavitha) కాకుండా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ చేసిన అతిపెద్ద సాయం కవితను అరెస్ట్ చేయకపోవడమే. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌ అంశంలో కవితపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం ఉన్న 36 మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అమిత్‌ అరోడా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ అరెస్టు చేసింది కూడా. వీరిలో తెలుగురాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్‌, సృజన్‌రెడ్డిలు ఉన్నారు.

అందరినీ అరెస్ట్ చేసినా బీజేపీ కవితను మాత్రం అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. దీంతో బీజేపీతో బీఆర్‌ఎస్‌ దోస్తీ కట్టినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. లిక్కర్‌ కేసులో కవితను వదిలిన నాటి నుంచి తెలంగాణలో బీజేపీ పతనం ప్రారంభమైంది. కేసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని కూతురిని బీజేపీ కాపాడిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలిచి తమకు అండగా నిలుస్తుందని భావించిన బీజేపీకి కథ అడ్డం తిరిగింది. బీఆర్ఎస్‌ చిత్తుగా ఓడిపోయింది. ఇక ఇంతటితో బీఆర్‌ఎస్‌ అవసరం బీజేపీకి ఎంతమాత్రం లేదనే విషయం తేటతెల్లమైంది.

తెలంగాణలో బీఆర్ఎస్‌ మాయం కానుందా?

మునుముందు రోజుల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు బీఆర్‌ఎస్‌నే మింగబోతున్నాయి. ఎలాగంటే.. తొలుత సీఎం రేవంత్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసును తిరగతోడి కవితను అరెస్ట్‌ చేస్తారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంతమాత్రం గానే ఉంది. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌లోని సగం మంది మంత్రులు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతారు. మిగతా వారిని బీజేపీ లాక్కుంటుంది. దీంతో తెలంగాణలో కేసీఆర్‌ ప్రాబల్యం క్రమంగా కనుమరుగై పోతుంది. మిగిలిన రెండు జాతీయ పార్టీలు మాత్రమే ఉంటాయి. బీఆర్‌ఎస్‌తో బీజేపీకి ఎలాంటి అవసరం లేదు. కాబట్టి బీజేపీ తొలుత లిక్కర్‌ కేసులో కవితను అరెస్ట్ చేసి, ఆ తర్వాత ఎంక్వైరీల పేరుతో యాంటీ కరెప్షన్‌ బ్యూరో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది (ఇప్పటికే రావోలు బాస్కర్‌ యాంటీ కరెప్షన్‌ బ్యూరోకి కంప్లైట్‌ ఇచ్చాడు).

ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను మూడో పార్టీగా లేకుండా చేస్తాయి. ఓ వైపు రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్‌, కేంద్ర స్థాయిలో బీజేపీ దాడి చేస్తాయి. కవితను అరెస్ట్‌ చేస్తే బీజేపీకి బీఆర్‌ఎస్‌కు సంబంధం లేదనే విషయం స్పష్టం అవుతుంది. మరో మూడు నెలల్లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కొన్నైనా ఎంపీ స్థానాలు దక్కాలంటే బీజేపీ కవితను అరెస్ట్‌ చేయడమే మార్గం. కవితను అరెస్ట్ చేస్తేనే తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే అవకాశం ఉంటుంది. అప్పుడే బీఆర్‌ఎస్‌కి దూరంగా ఉన్నట్లు ప్రజలు బీజేపీని నమ్మడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.