తాజా వార్తలు

ఎక్కడ… ఏ పార్టీల్లో చూసిన టిక్కెట్ల లొల్లి… ఇక్కడ ఎవరి గోల వారిదే…?

నాయకుల్లో స్తబ్ధత, టెన్షన్..రోజు రోజుకూ టెన్షన్

Share this :

దేశ రాజకీయాలలో పెను సంచలన మార్పులకు నాంది పలికింది ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో 2024 ఎన్నికల అభ్యర్థిత్వాలకు కు సంబంధించి అధిష్టానాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుయోనని పార్టీల నాయకుల్లో స్తబ్ధత, టెన్షన్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో అంటూ ఊదరగొడుతున్న వార్తలు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడ్డా టికెట్ ఖరారు కాని, పక్షంలో నేతలు ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

నియోజకవర్గాల పునర్విభజన తో ఉమ్మడి కడపజిల్లా లోని లక్కిరెడ్డి పల్లె నియోజక వర్గం కనుమరుగైంది. దీంతో అక్కడి రెడ్డెప్పగారి, గడికోట కుటుంబాలు రాయచోటి కి వలస వచ్చాయి. 2014, 2019 లో రమేష్ కుమార్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాటి నుంచి పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి గా కొనసాగుతున్నారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ జగన్ వెంట శ్రీకాంత్ రెడ్డి నడిచారు. 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున మరో మారు విజయం సాధించారు. అలాగే 2014, 2019 ఎన్నికల్లో సైతం విజయ బావుటా ఎగుర వేశారు. రాయచోటి లో తొలినాళ్ళ నుంచి రాజకీయం నడిపిన మండిపల్లి, సుగవాసి కుటుంబాలు రాయచోటి నియోజక వర్గంలో రాజకీయంగా వెనుక బడ్డాయి. గత పదిహేనేళ్లుగా వలస వచ్చిన కుటుంబాలే రాయచోటి గడ్డ పై జండా ఎగుర వేశాయి.

2024 ఎన్నికల సమయానికి పరిస్థితి పూర్తిగా మారింది. సుగవాసి కుటుంబం నుంచి పాలకొండరాయుడు చిన్న కుమారుడు ప్రసాద్ బాబు టీడీపీ టికెట్ ఆశించారు. వైసీపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ లో చేరి టికెట్ ఆశించారు. అలాగే లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట ద్వారకనాధ రెడ్డి సైతం టీడీపీ లో చేరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీడీపీ లో టికెట్ ఆశించే వారి సంఖ్య నాలుగుకు పెరిగింది.

టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కుటుంబానికి ఒకే టికెట్ అనడంతో రెడ్డెప్పగారి, సుగవాసి కుటుంబాలలో చిచ్చు పడ్డట్లైంది. సుగవాసి కుటుంబంలో పాలకొండరాయుడు పెద్ద కుమారుడు, మాజీ జెడ్పీ చైర్మన్ సుగవాసి బాల సుబ్రమణ్యంకు రాజంపేట ఎంపీ టికెట్ అతర్గతంగా కేటాయించడంతో ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ప్రసాద్ బాబుకు చెక్ పెట్టినట్లు అయింది. ఈయన ప్రస్తుతం తన సోదరుడి గెలుపు కోసం వ్యూహ ప్రతి వూహాలతో ప్రజలను కలుస్తూ ముందుకు సాగుతున్నారు.

వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాధ రెడ్డి తన కున్న పరిచయాలు, నందమూరి కుటుంబం తో ఉన్న బంధుత్వంతో ఈయన టికెట్ ఆశిస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలో పార్టీ కార్యాలయం ప్రారంభించి నాయకులతో కలుస్తున్నారు. వైసీపీ నుంచి ఉన్నట్టుండి వచ్చి టికెట్ ఆశించడంతో ప్రజల్లో ఆదరణ ఎంత మేరకు ఉంటుందో వేచి చూడాలి.

అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం చంద్రబాబు టికెట్ కేటాయిస్తారన్న ఆశతో నియోజక వర్గ వ్యాప్తంగా తిరుగుతూ వచ్చారు. గత కొన్నేళ్లుగా పార్టీ క్యాడర్ ను బలపరచుకుంటూ వస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన పలు కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ వచ్చారు. ప్రచార రథాలు సైతం తయారు చేయించుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర పోటీ నడుమ నేటికీ తనకే టికెట్ వస్తుందన్న ఆశతో చూస్తున్నారు.

టీడీపీలో ఇక చివరిగా రమేష్ కుమార్ రెడ్డి. ఇంఛార్జి గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాలు చేశారు. పదేళ్లుగా పార్టీ బాధ్యతలు చూస్తుండటం, నియోజకవర్గ వ్యాప్తంగా బూత్ లెవెల్లో తన వర్గీయులు కొనసాగుతున్నారు. పార్టీ ఇచ్చిన భవిష్యత్ కు భరోసా లాంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలను ప్రోత్సహించి నియోజకవర్గంలో సుమారు 70 వేల ఇండ్లకు చేరేలా చర్యలు చేపట్టారు. జోన్ 4 మీటింగ్ లో పార్టీ అధినేత చంద్రబాబు సైతం రాష్ట్రంలో రాయచోటి రెండో స్థానంలో ఉందని కితాబిచ్చారు. రెండు సార్లు ఓడినా, డబ్బు పోగొట్టుకున్నా ఇంఛార్జి గా కొనసాగారు. దీంతో ప్రజల్లో రమేష్ రెడ్డి కి సానుభూతి పెరిగింది. ఇదిలా ఉంటే కడప ఎమ్మెల్యే టికెట్ తన సోదరుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి భార్య మాధవి రెడ్డికి కేటాయించడం తో రమేష్ రెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. కుటుంబానికి ఒకే టికెట్ నినాదం రమేష్ రెడ్డి కి గుదిబండగా మారింది. టికెట్ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న రమేష్ రెడ్డి ప్రతి మండలంలో ఆత్మీయ సభలను ఏర్పాటు చేస్తు ముందుకు సాగుతున్నారు.

లక్కిరెడ్డిపల్లిలో రమేష్ రెడ్డి జరిపిన ఆత్మీయ సభ కార్యక్రమం లో సుమారు రెండువేల మంది అనుచరులు, అభిమానులు హాజరయ్యారు. టికెట్ వ్యవహారంలో ఎక్కడ ఎవరి మీద ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా ప్రసంగిస్తూ రమేష్ రెడ్డి ముందుకు సాగారు. ఎట్టి పరిస్థితులు ఎదురైనా తాను పోటీలో ఉంటానని అనుచరులకు భరోసా ఇస్తున్నారు.

రేపు పార్టీ అధిష్టానం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి గానీ, గడికోట ద్వరకనాధ రెడ్డి కి గానీ ఇదే పరిస్థితి కల్పిస్తే వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా లేక ఎన్నికల బరిలో ఉంటారా అన్నది త్వరలో తేలిపోనుంది.

ఇక అధికార వైసీపీలో సైతం స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కి కంటి మీద కునుకు లేకుండా పోయిందన్న వార్తలు నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. పక్క నియోజకవర్గం లక్కిరెడ్డి పల్లి నుంచి వలస వచ్చినా ఓటమి ఎరుగని నాయకుడిగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఐదో సారి పోటీ చేసి విజయం సాధించాలని తహ తహ లాడుతున్న శ్రీకాంత్ రెడ్డి టికెట్ లేదంటూ అధిష్టానం షాక్ ఇచ్చిందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నాలుగు సార్లు గెల్చిన శ్రీకాంత్ రెడ్డి పై వ్యతిరేకత ఉందని, దీంతో ఓటమి పాలవుతాడని పార్టీ పెద్దలు చెప్పారన్న పుకార్లు షికార్లు చేశాయి. పార్టీ అధిష్టానం నేటి వరకు విడుదల చేసిన అభ్యర్థుల ఏడు లిస్టులలో శ్రీకాంత్ రెడ్డి పేరు లేక పోవడం అనుమానాలకు మరింత ధృడం చేకూరుతుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ సారి పార్టీ అధిష్టానం పిలవడం అప్పుడే పలు రకాల అఫర్లు శ్రీకాంత్ రెడ్డి ముందు ఉంచారాన్న ఊహాగానాలు సాగాయి. రాజంపేట ఎంపీ గా పోటీ గా చేయడమా, పార్టీలో కీలక బాధ్యతల్లో ఉండటం లాంటి పలు ఆఫర్లు ఇచ్చారన్న వార్తలు నియోజకవర్గంలో పరుగులు పెట్టాయి. ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి పేరు తెర పైకి రావడానికి సైతం కారణం శ్రీకాంత్ రెడ్డే నన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కడో ఉన్న ధనుంజయ రెడ్డిని సీఎం పేషీలో కి తీసుకువచ్చి తన గోతి తానే తవ్వుకున్నట్లు అయిందని విమర్శకులు భావిస్తున్నారు.

ఏదేమైనా అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతల వ్యవహార శైలి, వారు అనుసరిస్తున్న విధానాలు టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయి. ఏళ్ల తరబడి పార్టీ ని నమ్ముకుని కోట్ల రూపాయలు పోగొట్టుకుని, విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారు. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశలో ఉన్న నేతలు తమకు టికెట్ వస్తుందో రాదో అన్న వ్యవహారం కార్యకర్తలు, నాయకుల్లో టెన్షన్, బీపీ రోజు రోజుకూ పెంచుతోంది.

– సముద్రవాణి