ప‌ద‌వుల కోసం దిగజారను: భూమ‌న అభిన‌య్‌

తిరుప‌తి ప్ర‌జాతీర్పును గౌరవిస్తా

Share this :

భూమన అభినయ్ రెడ్డి అనే నేను….

ప‌ద‌వుల కోసం దిగ‌జారే త‌త్వం నాది కాదు. తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్, అలాగే నేను ప్రాతినిథ్యం వ‌హించిన నాల్గో డివిజ‌న్ కార్పొరేష‌న్ ప‌ద‌వికి నేను ఎప్పుడో రాజీనామా చేశాను. తిరుప‌తి వైసీపీ అభ్య‌ర్థిగా నా పేరు ఖ‌రారైన వెంట‌నే, నైతిక విలువ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చే నాయ‌కుడిగా ఆ ప‌దవుల్ని వ‌ద్ద‌నుకున్నాను. నేను ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విష‌యం ఎన్నిక‌ల‌కు ముందు అన్ని ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. తాజాగా ఒక ప‌త్రిక‌లో నా రాజీనామాల విష‌యాన్ని గోప్యంగా వుంచాన‌ని రాయ‌డం ఆశ్చ‌ర్యం అనిపించింది.

నా రాజీనామాను మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష గారితో పాటు మున్సిప‌ల్ శాఖ అధికారులు కూడా ఆమోదం తెలిపారు. ప్ర‌జాతీర్పును గౌర‌వించి కొత్త‌గా ఎన్నికైన తిరుప‌తి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు గారికి నేను శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేశాను. డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని తిరుప‌తి రూపురేఖ‌లు మార్చ‌డానికి స‌ద్వినియోగం చేసుకున్నాన‌ని న‌మ్ముతున్నాను. నేను పుట్టి పెరిగిన తిరుప‌తికి ఏదైనా మంచి చేయ‌డం కోస‌మే డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని ఉప‌యోగించుకున్నా. అంతే త‌ప్ప‌, దాన్ని అలంకారంగా నేనెప్పుడూ వాడుకోలేదు.

నా రాజీనామా లేఖ‌ను బ‌య‌ట పెట్టొద్ద‌ని ఒత్తిడి చేసాన‌ని రాయ‌డం వారి ఆలోచ‌న‌ల సంకుచితాన్ని బ‌య‌ట పెడుతున్న‌దే త‌ప్ప‌, అందులో నిజం లేద‌ని అంద‌రికీ తెలుసు. ప‌చ్చ‌కామెర్లోళ్ల‌కి లోక‌మంతా అట్లే క‌నిపిస్తుంద‌ని పెద్ద‌లన్న‌ట్టుగా, రాజీనామాపై గోప్య‌త పాటించ‌డం వెనుక అనుమానాలున్నాయ‌ని రాయ‌డాన్ని ఆ కోణంలో చూడాల్సి వుంటుంది. ప్ర‌జాతీర్పు నాకు వ్య‌తిరేకంగా వ‌చ్చినప్ప‌టికీ హుందాగా స్వీక‌రించాను. డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వి కోసం క‌క్కుర్తి ప‌డే స్వ‌భావం నాది కాద‌ని మ‌రోసారి చెబుతున్నాను. తిరుప‌తిలాంటి ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో పుట్ట‌డం, ఈ న‌గ‌రానికి డిప్యూటీ మేయ‌ర్‌గా రెండేళ్ల పాటు సేవ చేయ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నాను. రాబోవు రోజుల్లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా తిరుప‌తి ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజీనామాపై నిజానిజాలు చెప్ప‌డానికే ఈ వివ‌ర‌ణ అని తెలియ‌జేసుకుంటున్నాను.

న‌మ‌స్కారాల‌తో

మీ భూమ‌న అభిన‌య్