తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆసక్తికరమైన పొలిటికల్ గాసిప్ ఇప్పుడు జోరుగా ప్రచారం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు, వైఎస్సార్ వారసురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలను పార్లమెంట్‌లో కూర్చోబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు ఒక వ్యూహాత్మక ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Tollywood: సినీ ఇండస్ట్రీలో రచ్చ ముగిసినట్లేనా..?
ప్రస్తుత సమీకరణాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. కాబట్టి ఏపీ నుండి షర్మిలను రాజ్యసభకు పంపడం సాంకేతికంగా అసాధ్యం. అయితే, పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పూర్తి బలంతో అధికారంలో ఉంది. అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షర్మిల గతంలో తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పెట్టినప్పటి నుండి నేటి వరకు డీకే శివకుమార్ ఆమెకు రాజకీయంగా పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, కర్ణాటకలో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో ఒకటి షర్మిలకు కేటాయించాలని డీకే శివకుమార్ ద్వారా ఢిల్లీ హైకమాండ్‌కు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.
ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం ఒక పెద్ద వ్యూహాన్నే అమలు చేయబోతోంది. షర్మిలకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం ద్వారా పార్లమెంట్‌లో కాంగ్రెస్ తరఫున ఒక బలమైన గొంతుకను వినిపించే అవకాశం లభిస్తుంది. ఏపీలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నా, వలసలను ప్రోత్సహించాలన్నా అధినేత్రి చేతిలో పదవి ఉండటం చాలా ముఖ్యం. ఇది షర్మిలకు రాజకీయంగా, అలాగే క్యాడర్‌లో నమ్మకాన్ని పెంచడానికి ఆర్థికంగా, నైతికంగా ఎంతో ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read: Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం..!
ఇక రెండో ప్రధాన ప్లాన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డిఫెన్స్‌లో పడేయడం. ఏపీలో వైఎస్సార్‌సీపీ ఓటమి తర్వాత.. వైఎస్సార్ ఓటు బ్యాంకును తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని రాహుల్ గాంధీ స్కెచ్ వేశారు. జగన్ కంటే షర్మిలకే వైఎస్సార్ నిజమైన వారసత్వం ఉందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలంటే ఆమెకు పెద్ద పీట వేయాలి. రేపు పార్లమెంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల కంటే.. కాంగ్రెస్ ఎంపీగా షర్మిల గట్టిగా మాట్లాడితే, కేంద్ర స్థాయిలో వైఎస్సార్ బ్రాండ్‌ను కాంగ్రెస్ ఓన్ చేసుకున్నట్లు అవుతుంది. ఇది జగన్‌కు అంతర్గతంగా పెద్ద ఇబ్బందిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో.. షర్మిల రాజ్యసభ ఎంపీ హోదాతో ఏపీలో పర్యటిస్తే, ప్రజా సమస్యలపై పోరాడితే కూటమి ప్రభుత్వం కూడా ఆమెను తక్కువ అంచనా వేయలేదు. 2029 ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్‌ను మళ్లీ ప్రధాన బరిలోకి తీసుకురావాలంటే షర్మిలకు ఈ ఎంపీ పదవి ఒక పవర్‌ఫుల్ అస్త్రంగా మారుతుందని ఢిల్లీ పెద్దలు లెక్కలు వేస్తున్నారు. మరి ఈ రాజ్యసభ సీటు గాసిప్ ఎంతవరకు నిజమవుతుందో, ఏపీ పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.
