జగన్ కోటరీ విచ్ఛిన్నం.. ఒక్కొక్కరిపై తిరుగుతున్న ‘సిట్’ చక్రం..!

జగన్ ఆత్మలపై సిట్ గురి

Share this :
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు ‘జగన్ ఇన్నర్ సర్కిల్’ చుట్టూ తిరుగుతోంది. మద్యం కుంభకోణం, భూ కబ్జాలు, అవినీతి అక్రమాల కేసుల దర్యాప్తును గమనిస్తే.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడిభుజాలుగా వ్యవహరించిన అత్యంత కీలక వ్యక్తులే టార్గెట్‌గా సిట్, సీఐడీ, ఏసీబీ విచారణలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని శాసించిన కీలక అధికారులు, నేతలు, పీఏల నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేలా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

Also read: వైఎస్ షర్మిలకు రాజ్యసభ దక్కితే.. వైసీపీకి జరిగే 5 నష్టాలు ఇవే..!

ఈ ఆపరేషన్‌లో భాగంగా గత ప్రభుత్వంలో సీఎంఓ (CMO) లో అత్యంత పవర్‌ఫుల్ అధికారిగా ఉంటూ, అన్ని కీలక శాఖల ఫైళ్లను తెరవెనుక నడిపించారనే ఆరోపణలతో ధనుంజయ్ రెడ్డిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. జగన్ వ్యక్తిగత వ్యవహారాలు, రాజకీయ సమన్వయంలో కీలక పాత్ర పోషించిన కృష్ణమోహన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై కూడా సిట్ దృష్టి సారించింది. వీటితో పాటు టీటీడీ నిధులతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగిన పలు దందాల్లో బాలాజీ గోవిందప్ప పాత్రపై, తిరుపతి మరియు చంద్రగిరి నియోజకవర్గాల్లో సాగిన భూ సెటిల్మెంట్ల వ్యవహారాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
మరోవైపు పుంగనూరు, రాయచోటి పరిధిలో సాగిన మైనింగ్ దందాలు, మద్యం సిండికేట్ వ్యవహారాల్లో మిథున్ రెడ్డి బినామీలను సైతం అధికారులు టార్గెట్ చేశారు. మీడియా మేనేజ్‌మెంట్ పేరుతో సాగిన కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధుల మళ్లింపుపై ఇటీవల పీఆర్వో శ్రీహరిని విచారించి కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు లేటెస్ట్‌గా జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి వందల కోట్ల అక్రమాస్తులు, విజయవాడ కార్ల షోరూమ్ బినామీ వాటాలు, భార్య అకౌంట్‌లోని రూ.19.85 కోట్ల నగదు బయటపడటం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది.

Also Read: మాట వినకపోతే ఇన్‌ఛార్జ్‌ కే పవర్స్..?

ప్రస్తుతం విజయవాడలో సిట్ విచారణకు హాజరైన పుత్తా శివశంకర్‌రెడ్డి, ఉస్మాన్ సందీప్‌లను కేవలం సాధారణ నిందితులుగా అధికారులు చూడటం లేదు. జగన్ పీఏ నాగేశ్వరరెడ్డికి శివశంకర్‌రెడ్డి ప్రధాన బినామీ అని తేలడంతో.. ధనుంజయ్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి లాంటి వారు నడిపించిన సిండికేట్‌కు ఈ బినామీలకు ఉన్న లింకులను డిజిటల్ ఆధారాలతో వెలికితీయడమే సిట్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కీలక వ్యక్తులందరి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా.. గత ఐదేళ్ల పాలనలో జరిగిన దోపిడీ వెనుక ఉన్న అసలు ‘బిగ్ బాస్’ ఎవరనేది నిరూపించేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఇన్నర్ సర్కిల్ విచారణ ఏపీ రాజకీయాల్లో మరిన్ని భూకంపాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

leave a reply