ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం చవిచూడటంతో టీమిండియా మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 202 పరుగుల భారీ లక్ష్య చేధనలో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పరాజయం తర్వాత, 2026 టీ20 ప్రపంచకప్ హీరోగా నిలిచిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఘాటుగా స్పందించిన గౌతమ్ గంభీర్.. సంజూ శాంసన్‌ను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో వివరించారు.
సంజూ శాంసన్‌ను డ్రాప్ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు గంభీర్ బదులిస్తూ.. “సంజూ శాంసన్‌కు జట్టులో అతని పాత్రపై నా వైపు నుండి పూర్తి స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే అది కేవలం ఒక ఆటగాడికి, హెడ్ కోచ్‌కు మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ. ఆ విషయాలను నేను ఎట్టిపరిస్థితుల్లోనూ మీడియా ముందు బహిరంగపరచను” అని తేల్చి చెప్పారు. సంజూ శాంసన్ గతంలో భారత్ కోసం చేసిన ప్రదర్శనలు అద్భుతమైనవని కొనియాడిన గంభీర్.. కొన్నిసార్లు కేవలం ఆటగాడి ప్రస్తుత ఫామ్‌ను బట్టి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్ పర్యటనలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంజూ శాంసన్ స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకువచ్చినట్లు గంభీర్ వెల్లడించారు. అయితే సంజూకు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని.. ఈ సిరీస్‌లోనే అతను తిరిగి జట్టులోకి పునరాగమనం చేయలేడనే నిబంధన ఏదీ లేదని హింట్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ అనేది కేవలం వ్యక్తుల చుట్టూ తిరగదని, జట్టు కాంబినేషన్ మరియు ఫలితాల ఆధారంగానే తుది జట్టును ఎంపిక చేస్తామని గంభీర్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో రాణించాలంటే ప్రతి ఒక్కరూ తమ స్థానాన్ని కష్టపడి సంపాదించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రస్తుత యూకే (UK) పర్యటనలో భారత జట్టు ప్రదర్శనపై గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐర్లాండ్‌లోనైనా, ఇంగ్లాండ్ పిచ్‌లపైనా భారత బ్యాటర్లు అక్కడి వాతావరణ పరిస్థితులకు త్వరగా అలవాటు పడలేకపోయారనేది పచ్చి నిజమని అంగీకరించారు. మనం బాగా ఆడి పరిస్థితులకు తగినట్లు మారి ఉంటే.. ఇలా వరుసగా 4 మ్యాచ్‌లలో ఓడిపోయేవాళ్లం కాదని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే మ్యాచ్‌లలో జట్టు లోపాలను సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి