అంకారాలో జరిగిన నాటో (NATO) సదస్సు ముగించుకుని స్వదేశానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రయాణంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఖతార్ దేశం ఆయనకు బహుమతిగా ఇచ్చిన అత్యంత విలాసవంతమైన, సరికొత్త ‘బోయింగ్ 747-8’ విమానంలో ప్రయాణించాల్సిన ట్రంప్.. బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ మిల్డెన్ హాల్ వద్ద హఠాత్తుగా విమానం మార్చేశారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఇచ్చిన బలమైన భద్రతాసిఫార్సుల మేరకు ఆయన తన సరికొత్త జెట్‌ను వదిలేసి, పాత ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలోకి మారాల్సి వచ్చింది. ఈ ఆకస్మిక మార్పుపై విలేకరులుప్రశ్నించగా, ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు.
“నాకు ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది. ఇరాన్ హిట్ లిస్ట్‌లో నేనే నెంబర్ వన్” అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కొత్తగా వచ్చిన ఖతార్ జెట్ అద్భుతంగా ఉందని, బ్రిటన్‌లో ఉన్న అమెరికా సైనిక సిబ్బంది దాన్ని చూసి ఆనందించడానికే అక్కడ ఆపినట్లు ఆయన చెప్పారు. కేవలం పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికే పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తున్నట్లు పైకి కవర్ చేసినప్పటికీ.. శత్రువుల నుంచి వచ్చే ముప్పులను తిప్పికొట్టే పూర్తి స్థాయి రక్షణ వ్యవస్థలు (మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్) ఇంకా కొత్త విమానంలో అమర్చకపోవడమే ఈ ఆకస్మిక మార్పునకు అసలు కారణమని అధికారులు అంగీకరించారు.
ఈ విమాన ప్రయాణంలో భద్రత ఏ స్థాయిలో ఉందంటే.. ప్రయాణ సమయంలో కిటికీ తెరలు (Window Blinds) అన్నీ మూసి ఉంచాలని రిపోర్టర్లను ఖచ్చితంగా ఆదేశించారు. ఇరాన్‌ను ఉద్దేశించి “ఇక్కడ కొందరు నీచులు ఉన్నారు, మనల్ని కనిపెడుతున్నారు” అని ట్రంప్ అనడం ఆందోళన రేకెత్తించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసిందనే ఆరోపణలతోఅమెరికా ఇటీవలే ఇరాన్ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడటంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ ఉద్రిక్తతల వల్లే ట్రంప్ భద్రతపై ఇంతలా హైడ్రామా నడిచింది. ఖతార్ ఇచ్చిన కొత్త విమానం సురక్షితం కాదనే వార్తలను వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ ఛెంగ్ కొట్టిపారేశారు. కొత్త విమానంలో కూడా అత్యున్నత భద్రతా ప్రోటోకాల్స్ ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే అధ్యక్షుడి రక్షణ కోసం శత్రువులను తప్పుదోవ పట్టించడం (Misdirection),వారి దృష్టిని మళ్లించడం (Distraction) వంటి వ్యూహాలను కూడా తమ రక్షణ విభాగం వాడుతుందని, అందులో భాగంగానే ఈ విమానాల మార్పు జరిగి ఉండవచ్చని ఆయన పేర్కొనడం గమనార్హం.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి