Belagavi Crime బెళగావి, డిసెంబర్ 12: కన్నడనాట (Karnataka) సభ్య సమాజం తలదించుకునే ఘోర ఉదంతం వెలుగు చూసింది. ఓ ప్రేమ జంట (lovers eloped) పెద్దలకు తెలియకుండా ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో కక్ష్యగట్టిన యువతి తరపు బంధువులు యువకుడి తల్లి (Woman)పై పైశాచికంగా దాడి చేశారు. యువకుడి తల్లిని దారుణంగా హింసించారు. ఆమెను వివస్త్రను చేసి వీధుల్లో ఊరేగించారు. ఊరి మధ్యలో స్తంభానికి (electricity pole) కట్టివేసి అర్ధరాత్రి వరకు దారుణంగా కొట్టారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బెళగావి (Belagavi)కి సమీప గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బెళగావికి సమీప గ్రామానికి చెందిన ఓ యువతి (20), ఓ యువకుడు (24) కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే ఆమెకు కుటుంబ సభ్యులు మరో యువకుడితో వివాహం కుదిర్చి, నిశ్చితార్థం జరిపించారు. దీంతో ప్రేమ జంట ఆదివారం రాత్రి ఇళ్ల నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు సదరు యువకుడి ఇంటిపై దాడి చేశారు. అతరి తల్లిని (42) వీధిలోకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేశారు. అనంతరం ఆమెను నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వద్దకు ఈడ్చుకొచ్చి, ఊరి జనం ముందు స్తంభానికి కట్టి అర్ధరాత్రి వరకు దారుణంగా కొట్టారు. ఊళ్లో ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ వారిని అడ్డుకోకపోవడం విశేషం.
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను రక్షించారు. బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులను నియమించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య సైతం స్పందించారు. ఆధునిక యుగంలోనూ ఇలా ఒక మహిళను వివస్త్రను చేసి ఊరేగించడం, స్తంభానికి కట్టి హింసించడం సిగ్గుచేటని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు సభ్య సమాజం తలవంచుకునేలా ప్రవర్తించారని, ఇలాంటి అరాచకాలను సహించబోమన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
