కుప్పకూలిన రైల్వే వంతెన.. 22 మంది మృతి

Share this :

మిజోరాం లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలి 22 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలో సాయిరంగ్ ప్రాంతంలో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో దాదాపు నలభై మంది వరకు కూలీలు ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు.

భైరవిసాయిరంగ్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కురుంగ్ నదిపై ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. బుధవారం ఎప్పటిలాగే నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఉదయం 10 గంటల ప్రాంతంలో వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని తెలుస్తుంది. ఇప్పటి వరకు 22 మృతదేహాలు బయటకు తీయగా.. మరికొంతమంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుని ఉండగా వారిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు రైల్వే సిబ్బంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా ‘ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైలు బ్రిడ్జీ కూలిన విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయినట్లు వెల్లడించారు. శిథిలాల కింద ఉన్న వారిని రెస్క్యూ టీమ్ రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసున్నా’ ట్విట్టర్ వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేశారు.