అమరావతి, నవంబర్ 16: టీడీపీ (TDP) నేత బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డిని అరెస్టు (BTech Ravi Arrest) చేసి, పులివెందులలో భయానక వాతావరణంలో సృష్టించాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు స్పష్టం అవుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghu Rama Krishna Raju) అన్నారు. దీన్నిబట్టి చూస్తే, పులివెందుల (Pulivendula)లో కూడా నెగ్గగలమా అనే అనుమానం ‘వైనాట్ 175’ అని చెప్పుకు తిరిగే పాలకుల్లో కనిపిస్తోందన్నారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ… ‘జైలులో , కోర్టుకు తరలించే సమయంలో బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డికి (BTech Ravi Arrest) ఏమైనా హాని జరిగితే, దానికి పులివెందుల ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan) పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వైకాపా (YSRCP) తరఫున, ప్రజల తరఫున హెచ్చరిస్తున్నానని’ అన్నారు.
ఈ ఏడాది జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడప జిల్లా పర్యటన సందర్భంగా ఓ ఏఎస్ఐ అధికారికి వాహనం టైరు రాసుకు పోయింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. అయినా, బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డిపై (BTech Ravi) ఐపీసీ 324 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా తేలితే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. కోర్టు ద్వారా బెయిల్ కూడా పొందవచ్చు. ఎలాగైనా బీటెక్ రవి పై పదేళ్ల శిక్షార్హమైన కేసును నమోదు చేయాలని భావించిన పోలీసులు సెక్షన్ మార్చారు. ఐపీసీ సెక్షన్ 333 కింద కేసు నమోదు చేశారు.విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేస్తే, ఆ అధికారికి తీవ్ర గాయాలయితే దాడి చేసిన వారిపై ఐపీసీ 333 సెక్షన్ను మోపుతారు. దీంతో మంగళవారం పులివెందుల నుంచి కడప (YSR Kadapa district)కు వెళ్తున్న బీటెక్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల వరకు ఆయన్ని ఎవరు అరెస్టు చేశారో చెప్పలేదు. చివరకు వల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో బీటెక్ రవిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఒకవేళ బీటెక్ రవిని క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టు చేస్తే, బెట్టింగ్ ఆడుతుండగా అరెస్టు చేయాలి కానీ.. రోడ్డుపైన వాహనంలో వెళుతున్న వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని రఘురామ ప్రశ్నించారు.
రాత్రి రెండు గంటల సమయంలో గతంలో పులివెందులలో పనిచేసి, ప్రస్తుతం పోరుమామిళ్ల అనే ప్రాంతంలో సీఐగా పని చేస్తున్న మల్లికార్జున అనే పోలీసు అధికారి బీటెక్ రవిపై కేసు నమోదు చేశారు. క్రికెట్ బెట్టింగ్ (Cricket betting) వ్యవహారంలో అరెస్ట్ చేసిన బీటెక్ రవిపై పది నెలల క్రితం నమోదు చేసిన కేసులో ఆయన తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు చెప్పడం సిగ్గుచేటు. మంగళవారం కూడా తప్పించుకుని వెళ్తుంటే, తమకు దొరికాడని పోలీసులు చెప్పడం చూస్తుంటే జనాలు అంత వెర్రి వెంగళప్పల్లా కనిపిస్తున్నారా? అని రఘురామ మండిపడ్డారు. గత పది నెలల వ్యవధిలో ప్రస్తుత ఎస్పీని, ఇక్కడ నుంచి బదిలీ అయి వెళ్లిన ఎస్పీని బీటెక్ రవి ఎన్నిసార్లు కలిశారో రికార్డులను తనిఖీ చేయాలని సూచించారు. పులివెందులలో టీడీపీ కార్యాలయాన్ని బీటెక్ రవి పర్యవేక్షణలో నిర్మించారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వైసీపీకి చెందిన 40 మంది నాయకులు టీడీపీలో చేరారు. పులివెందులలో వైసీపీకి కూడా లేనంత బ్రహ్మాండమైన కార్యాలయాన్ని టీడీపీ కోసం బీటెక్ రవి పర్యవేక్షణలో నిర్మించడంతో, పులివెందుల పర్యటనకు వెళ్ళిన జగన్ ఆ కార్యాలయ భవనాన్ని చూసి తన అక్కసును వెళ్లగక్కినట్లు తెలిసింది.
ప్రధాన రహదారిలో ఇంత పెద్ద భవంతుని ఎలా నిర్మించనిచ్చారంటూ జగన్ వైసీపీ నేతలతో అన్నట్లు తెలిసింది. పులివెందులకు జగన్మోహన్ రెడ్డి వెళ్లడం.. వెంటనే బీటెక్ రవిపై పోలీసులు కేసులను నమోదు చేయడం జరిగిపోయాయి. పది నెలలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారన్న బీటెక్ రవి, టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు పోలీసులు కళ్ళు మూసుకున్నారా? అని రఘురామ ప్రశ్నించారు. బీటెక్ రవిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు పది నుంచి 11 నెలల క్రితం జరిగిన సంఘటన కు సంబంధించిన కేసులో ఇలా అర్ధరాత్రి హడావిడిగా తీసుకురావడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. కొల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఉదయాన్నే కోర్టులో హాజరుపరచాలని ఆయన పోలీసులను ఆదేశించారు. అక్కడ నుంచి బీటెక్ రవిని వల్లూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా, అప్పటికే మెజిస్ట్రేట్ తో పోలీసులు ఏమి మాట్లాడారో తెలియదు కానీ.. మార్గమధ్యలోనే ఆయన్ని బ్రతిమాలి పోలీసులు 41 A నోటీసు అందజేసి, మళ్లీ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
మెజిస్ట్రేట్, బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించారు. బీటెక్ రవి తరుపున రేపు న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇది తప్పుడు కేసు అని స్పష్టం అవుతుంది. ఈ కేసులో కచ్చితంగా ఆయనకు బెయిల్ లభిస్తుంది. ఇక్కడ రాకపోయినా హైకోర్టులో మాత్రం ఆయనకు బెయిలు లభించడం ఖాయమని రఘురామ అన్నారు. అనంతరం సినీ హీరో కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా ఆయనకు రఘురామకృష్ణం రాజు ఘనంగా నివాళులు అర్పించారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.