త్వరలో ప్రెస్ క్లబ్ ప్రారంభానికి సన్నాహాలు..!
జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాల పెంపుదలే లక్ష్యం
సైబరాబాద్ రీజియన్ వ్యాప్తంగా కార్యకలాపాలకు ప్రణాళికలు
డెస్క్ మరియు ఫీల్డ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 16 ( మార్క్ టీవీ): తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని హైటెక్ సిటీ కేంద్రంగా అత్యున్నత ప్రమాణాలతో ఓ ప్రెస్‌క్లబ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. భాగ్యనగరం కేంద్రంగా పని చేస్తున్న పలువురు సీనియర్ జర్నలిస్టుల నేతృత్వంలో ఈ ప్రెస్‌క్లబ్‌ను తీసుకు రానున్నారని చెబుతున్నారు. మొత్తం సైబరాబాద్ రీజియన్ వ్యాప్తంగా పాత్రికేయ రంగానికి సేవలు అందించేలా ఈ ప్రెస్ క్లబ్ కార్యాచరణ ఉండబోతోందని సమాచారం. దశాబ్దాలుగా మీడియా రంగంలో ఉన్నప్పటికీ నిరాదరణకు గురౌతున్న పాత్రికేయ మిత్రులకు తోడ్పాటు అందించటంతో పాటు కొత్తగా మీడియా రంగంలోకి ప్రవేశిస్తోన్న యువ జర్నలిస్టులకు ఆలంబనగా ఉండేలా ఈ ప్రెస్ క్లబ్ విధి విధానాలు రూపొందించినట్టు చెబుతున్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ పార్టీలకు అనుబంధంగా లేని.. డెస్క్ మరియు ఫీల్డ్ జర్నలిస్టులే ఈ ప్రెస్‌క్లబ్ లో కీలకంగా ఉంటున్నారని తెలుస్తోంది. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి నైపుణ్య శిక్షణ కెరీర్ గైడెన్స్, జర్నలిస్టుల కుటుంబాలకు ఆరోగ్య భీమా, గృహ వసతి సాధన, జర్నలిస్టు పిల్లలకు స్కూల్, కాలేజీ విద్యలో రాయితీ కల్పన వంటి పలు ముఖ్య అంశాలపై హైటెక్ సిటీ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ప్రెస్ క్లబ్ ఫోకస్ చేయనున్నట్టు చెబుతున్నారు. అయితే.. ప్రెస్ క్లబ్ కార్యకలాపాలకు సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడి కానున్నట్టు తెలుస్తోంది.
