16 డాక్యుమెంట్ లు చూపినా భారతీయుడు కాదన్న కోర్ట్.!

పౌరసత్వంపై పెద్ద సమస్యే..?

Share this :

భారత పౌరసత్వాన్ని నిరూపించుకునే ప్రక్రియపై గౌహతి హైకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వాన్ని నిరూపించాల్సిన సంపూర్ణ బాధ్యత సదరు దరఖాస్తుదారుడిపైనే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. విదేశీయుల చట్టం-1946 లోని సెక్షన్ 9 ప్రకారం.. ఒక వ్యక్తి భారతీయ పౌరుడా కాదా అనే సందేహం తలెత్తినప్పుడు, తానే స్వయంగా నిష్పాక్షికమైన ఆధారాలతో పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని జస్టిస్ కల్యాణ్ రాయ్ సురానా, జస్టిస్ షమీమా జహాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.

Also Read: ఢిల్లీని వణికిస్తున్న ‘కంటికి కనిపించని’ డేంజర్ ఓజోన్ గ్యాస్..!

అస్సాంకు చెందిన ఒక వ్యక్తిని ‘విదేశీయుడు’ (Foreigner) గా ప్రకటిస్తూ గతంలో ఫారియర్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. పిటిషనర్ తన వాదనకు మద్దతుగా 1951 ఎన్‌ఆర్‌సీ (NRC) కాపీలు, ఓటర్ల జాబితాలు, భూమి రికార్డులు, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ మరియు స్కూల్ సర్టిఫికెట్ వంటి దాదాపు 16 రకాల అధికారిక పత్రాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అయితే, ఈ పత్రాలన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం.. వాటిలో వంశపారంపర్య లింకును (Lineage) మరియు నివాస వివరాలను చట్టబద్ధంగా అనుసంధానించడంలో పిటిషనర్ విఫలమయ్యారని పేర్కొంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Also Read: భర్త గురక తట్టుకోలేక భార్య విడాకులు..!

ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఒక మైండ్ బ్లోయింగ్ కామెంట్ చేసింది. కోర్టు ముందు ఎన్ని వందల పత్రాలు పెట్టామనేది లేదా “పత్రాల సంఖ్య” అనేది ఇక్కడ ముఖ్యం కాదని, సమర్పించిన పత్రాల యొక్క “చట్టబద్ధత మరియు విశ్వసనీయత” మాత్రమే కీలకమని వ్యాఖ్యానించింది. అధికారిక రికార్డులలో పేర్ల స్పెల్లింగులు, వయస్సు, మరియు కుటుంబ సభ్యుల వివరాలలో స్పష్టత లేనప్పుడు.. కేవలం గుర్తింపు కార్డులు (PAN Card, EPIC) ఉన్నంత మాత్రాన పౌరసత్వం సిద్ధించదని కోర్టు స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి లేని ఆధారాలను పౌరసత్వ నిరూపణకు ప్రాతిపదికగా తీసుకోలేమని గౌహతి హైకోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది.