వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సరికొత్త అంతర్మథనం మొదలైంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై క్యాడర్‌కు ఒక క్లారిటీ ఉంటే.. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అసలు జగన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారా.. లేక కూటమి ప్రభుత్వానికి మైలేజ్ ఇచ్చేలా టీడీపీకి ‘దురంధరుడు’ లాగా వ్యవహరిస్తున్నారా? అనే రేంజ్‌లో సొంత పార్టీ నేతలే లోలోపల మండిపడుతున్నారు. జగన్ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, స్థానిక సమస్యలపై వైసీపీ పోరాటం చేస్తే ప్రజల్లో సింపతీ వచ్చేది. కానీ, జగన్ మాత్రం సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న ‘ప్రశ్న రావణ్’ లాంటి వివాదాస్పద వ్యక్తుల అరెస్టులను ఖండించడం, అలాగే ‘మావిగాన్’ లాంటి సున్నితమైన అంశాలను నెత్తినేసుకోవడం చూసి క్యాడర్ తలపట్టుకుంటోంది. హిందూ సమాజానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన చరిత్ర ఉన్న వ్యక్తుల వెనుక వైసీపీ నిలబడుతోందనే ముద్ర పడటం వల్ల.. ఆ నెగెటివిటీని క్యాడర్ క్షేత్రస్థాయిలో డిఫెండ్ చేసుకోలేకపోతోంది. ఇది పరోక్షంగా టీడీపీకి ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా మారుతోంది.
పార్టీ కోసం రోడ్లపైకి వచ్చి కేసులు పెట్టించుకునే సామాన్య కార్యకర్తలకు, నాయకులకు ఈ పరిణామాలు అస్సలు నచ్చడం లేదు. “మనం ప్రజల కోసం కొట్లాడాలా.. లేక సమాజంలో బ్యాడ్ నేమ్ ఉన్న వ్యక్తుల కోసం లీగల్ సపోర్ట్ ఇవ్వాలా?” అంటూ వైసీపీ క్యాడర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక స్థానిక లీడర్లు సైలెంట్ అయిపోతున్నారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఇస్తున్న తప్పుడు సలహాల వల్లే పార్టీ ఈరోజు ఇంతటి దారుణమైన లూప్‌లో పడిపోయిందని అంతర్గత చర్చలు నడుస్తున్నాయి.
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఏదైనా చిన్న అసంతృప్తి వచ్చే లోపే.. వైసీపీ ఒక కొత్త వివాదాన్ని లీడ్ చేస్తూ కూటమికి సేఫ్ గేమ్‌ను క్రియేట్ చేస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పదే పదే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్‌ను టచ్ చేయడం వల్ల, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా ఈజీగా వైసీపీపై ‘యాంటీ-సోషల్’, ‘యాంటీ-సనాతన ధర్మ’ ముద్ర వేయగలుగుతోంది. గత ఎన్నికల్లో తిరుమల లడ్డూ వివాదం లాంటి దెబ్బ తిన్నాక కూడా జగన్ తన వ్యూహాలను మార్చుకోకపోవడం చూస్తుంటే.. వైసీపీని క్యాడర్ కంటే ఎక్కువగా టీడీపీనే బాగా వాడుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి