లార్డ్స్ మైదానంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 27 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ను 1-2 తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సిరీస్ పరాజయంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందిస్తూ, తొలి ఇన్నింగ్స్ చివర్లో బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడమే జట్టు ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రైజ్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 45వ ఓవర్ వరకు తాము మ్యాచ్ లో గట్టి పోటీలోనే ఉన్నామని.. అయితే ఇన్నింగ్స్ చివరి మూడు ఓవర్లలో బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడం వల్లనే మ్యాచ్ తమ చేతుల్లోంచి చేజారిపోయిందని ఒప్పుకున్నాడు. డెత్ ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోవడంలో జట్టు బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని కెప్టెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, మొదటి పవర్ ప్లేలోనే బౌలర్లు సరిగ్గా రాణించకపోవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బలమైన పునాది వేసుకుందని గిల్ చెప్పుకొచ్చాడు.
బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్ లతో పాటు చివర్లో జోస్ బట్లర్ చెలరేగడంతో ఇంగ్లండ్ కోరుకున్న భారీ స్కోరును సాధించగలిగింది. బ్యాటింగ్‌లో 40 ఓవర్ల తర్వాత చేతిలో వికెట్లు ఉంచుకుని, చివరి 10 ఓవర్లలో ఓవర్ కు 10 పరుగుల చొప్పున ఛేదించాలనే ప్రణాళికతో బరిలోకి దిగామని, కానీ అంతకుముందే లక్ష్యం చాలా పెద్దదిగా మారిపోయిందని ఆయన వివరించాడు. ఈ మ్యాచ్ లో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ సాధించిన అద్భుత సెంచరీపై గిల్ హర్షం వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ ముగిసే కొద్దీ పిచ్ మందగించి, షాట్లు ఆడటం కష్టంగా మారినప్పటికీ.. రోహిత్ ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ ఎందుకయ్యాడో మరోసారి నిరూపించాడని కొనియాడాడు. కష్టతరమైన పిచ్ పై రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ చూడముచ్చటగా సాగిందని ప్రశంసించాడు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి