లోపం ఎక్కడ..? చంద్రబాబును ద్వేషించే అధికారికి కీలక పోస్టింగ్.!

స్వీట్లు పంచిన అధికారికి టీటీడీ గిఫ్ట్

Share this :

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన సందర్భంలో అత్యుత్సాహం ప్రదర్శించి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒక అధికారికే ఇప్పుడు ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పోస్టింగ్ దక్కడం తీవ్ర కలకలం రేపుతోంది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ (Assistant Executive Engineer) గా పనిచేస్తున్న సదరు అధికారి బదిలీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాకుండా, అధికార వర్గాల్లోనూ సంచలనంగా మారింది.

Also Read: నోటి దూలను క్షమించని విజయ్, ఎమ్మెల్యేల అరెస్ట్ అందుకే..!

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో.. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ స్థాయి అధికారిగా ఉన్న ఒకరు బహిరంగంగా స్వీట్లు పంచిపెట్టారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. “చంద్రబాబు మళ్లీ తిరిగి రాడు.. ఒకవేళ అతను జైల్లోనే మరణిస్తే పొట్టేళ్లను విందుగా ఇస్తా” అని సదరు అధికారి వ్యాఖ్యానించారన్న ప్రచారం అప్పట్లో బలంగా సాగింది.

ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, ప్రతిపక్ష నేత ప్రాణాలకే ముప్పు వాటిల్లాలని కోరుకుంటూ దారుణ వ్యాఖ్యలు చేసిన అటువంటి వ్యక్తికి.. ఇటీవల అత్యంత పవిత్రమైన తిరుమల ప్రధాన ఆలయానికే (శ్రీవారి ఆలయం) ఏఈఈగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో అంతలా కక్షపూరితంగా వ్యవహరించిన సదరు ఏఈఈ స్థాయి అధికారికి తిరుమల శ్రీవారి ఆలయంలోనే కీలక పోస్టింగ్ కేటాయించడంపై టీడీపీ శ్రేణులతో పాటు టీటీడీ అంతర్గత సిబ్బంది కూడా తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కీలక పోస్టులో అవినీతి అధికారి.. ఏమిటిది బాబు..?

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ కాలంలో అత్యుత్సాహం ప్రదర్శించిన సదరు అధికారికి ఇంతటి ప్రాధాన్యత ఉన్న పోస్టింగ్ ఎలా దక్కిందనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వివాదాస్పద బదిలీపై ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. టీడీపీని ఇబ్బంది పెట్టిన వారిని, వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులకు కీలక పోస్టింగ్ లు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ పలువురు మండిపడుతున్నారు.

leave a reply