జూనియర్ పొలిటికల్ ఎంట్రీ.. సక్సెస్ అవుతాడా..?

జూనియర్ ఎన్టీఆర్‌.. పొలిటికల్‌ ఎంట్రీకి మొదటి అడుగు.?

Share this :

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్. అదే కొత్త రాజకీయ పార్టీల రాక. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయనే ప్రచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద ఎత్తు చర్చకు దారి తీసింది. ఇప్పటికే ముఖ్య నేతల వారసులు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఓ వైపు తెలంగాణ రక్షణ సేన అధినాయకురాలు కల్వకుంట్ల కవిత పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ఆమె దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మరో సెలబ్రెటీ కూడా రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది.

Also Read: పెరుగుతున్న గ్యాస్ ధరల సెగ, కేంద్రం కీలక నిర్ణయం..?

జూనియర్ ఎన్టీఆర్‌.. పొలిటికల్‌ ఎంట్రీకి మొదటి అడుగు.. అంటూ నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో రాణించేందుకు సిద్ధం అవుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. రాజకీయ రంగ ప్రవేశానికి ముందుగా ప్రజలకు చేరువయ్యేందుకు సేవను మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తాత నందమూరి తారక రామారావు స్పూర్తితో సేవా యజ్ఞం ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఊరు వాడ పేరుతో ఏకంగా రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈ నెల 18వ తేదీన తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారనే పుకార్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాటా టాపిక్‌గా మారాయి.

నిజానికి పొలిటికల్ ఎంట్రీపైన, ఊరు వాడ సేవా యజ్ఞం పైన ఇప్పటి వరకు అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు ఆయన అభిమానులు కనీసం స్పందించలేదు. అసలు రాజకీయ ప్రవేశంపై కనీస ప్రకటన చేయలేదు. అదే సమయంలో ఈ పుకార్లను కూడా ఖండించలేదు. దీంతో ఈ నెల 18న జూనియర్ ప్రెస్ మీట్ ఉంటుందా.. ఉంటే.. అందులో ఆయన చేసే ప్రకటన పైనే అందరూ దృష్టి పెట్టారు. జూనియర్‌కు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కొందరంటుంటే.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం అని మరికొందరంటున్నారు. సినిమాలతో జూనియర్ బిజీగా ఉన్నారని సన్నిహితులు చెబుతుంటే.. రాజకీయాల్లో రాణించాలనేది ఆయన చిరకాల కోరిక అనేది అభిమానుల మాట.

Also Read: అమరావతి నిర్మాణానికి ఊపు, కీలక పరిణామం..!

అయితే.. ఇదే సమయంలో జూనియర్ పొలిటికల్ ఎంట్రీ పైన మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్నికల్లో రాణిస్తారా.. అనే అంశంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. నిజానికి రాజకీయాల్లోకి రావడం పైన, రాజకీయాలపైన మాట్లాడం జూనియర్‌కు ఇదే తొలిసారి కాదు. 2009 ఎన్నికల్లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ప్రచారం కూడా చేశారు. ఇచ్ఛాపురం నుంచి ఖమ్మం వరకు రోడ్ షో నిర్వహించారు. ఆ సభలకు జనం, అభిమానులు భారీగానే వచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన పార్లమెంట్ స్థానాల పరిధిలో ఒక్క ఖమ్మం తప్ప.. మిగిలిన అన్ని చోట్ల కూడా టీడీపీ ఓడిపోయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం, ఏలూరు లోక్‌సభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోగా.. ఖమ్మంలో మాత్రమే నామా నాగేశ్వర్రావు విజయం సాధించారు. దీంతో అప్పట్లో జూనియర్ ప్రభావం పెద్దగా లేదంటున్నారు విశ్లేషకులు. అయితే 2009కి 2029 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

leave a reply