యువ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ, తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించుకుని శరవేగంగా దూసుకుపోతోంది. రామ్ తన హోమ్ బ్యానర్ అయిన ‘రాపో సినిమాటిక్స్’ పతాకంపై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, కృష్ణ పోతినేని చిత్ర నిర్మాణ బాధ్యతలను చూసుకుంటున్నారు. హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన రామ్, ఈసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తుండటంతో సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పూర్తి స్థాయి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ముస్తాబవుతున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం చిత్ర బృందం ఒక క్రేజీ బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసింది. ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నడించబోతున్నాడు. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే ముగిశాయని, త్వరలోనే ఆయన నేరుగా చిత్ర సెట్స్‌లోకి అడుగుపెట్టి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని సమాచారం. జాకీ ష్రాఫ్ లాంటి సీనియర్ నటుడు తోడవడంతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగిందని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమాలో హీరో రామ్ పోతినేని మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన ‘వీర’ అనే పాత్రను పోషిస్తుండగా, దానికి సంబంధించిన గెటప్ చాలా విభిన్నంగా ఉండబోతోంది. రామ్ కెరీర్‌లోనే ఇది అత్యంత సవాల్‌తో కూడిన, ఒక పవర్‌ఫుల్ పాత్రగా నిలిచిపోతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి విరామం లేకుండా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి