ఇటీవల దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం, చనిపోవడం జరుగుతుంది. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరగింది. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే కి తృటిలో ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కి వస్తుండగా.. మానకొండూర్ మండలం లలితాపూర్ వద్ద ఈటెల కారుకు గొర్రెల మంద అడ్డు వచ్చింది. వాటిని తప్పించే క్రమంలో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి కాన్వాయ్ లో మరో కారు వేగంతో వచ్చి ఈటెల వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
