భావ ప్రకటన స్వేచ్ఛ.. ఇది భారత్‌లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ.. హక్కుల ముసుగులో ఎదుటి వారిని కించపరిచేలా.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా.. నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదు. నా మాట నా ఇష్టం.. అంటారు చాలా మంది.. కానీ ఆ మాట ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అనేది ప్రాధమిక హక్కు కూడా. మనోభావాలు దెబ్బ తినేలా నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేసినా, వ్యవహరించినా సరే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ కొందరు మేథావి ముసుగు వేసుకున్న పెద్ద మనుషులు మాత్రం.. విశ్లేషకుల ముసుగులో నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం.. తర్వాత ఎవరైనా వాటిని తప్పుబడితే.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది.
తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాలుగు రోజుల క్రితం రాజకీయ విశ్లేషణ పేరుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైన, మంత్రి నాదెండ్ల మనోహర్ పైన నోటికి వచ్చిన కామెంట్లు చేశారు. పవన్‌ను అమిత్ షా తిట్టాడని.. జగన్ మోహన్ రెడ్డిని అమిత్ షా మిత్రుడు అన్నారని.. చంద్రబాబును అవకాశవాది అన్నారని వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలకు సంబంధించినవి. కానీ నాగేశ్వర్ మాత్రం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో కూర్చుని ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమే దేశంలో ఎక్కడ నుంచి అయినా సరే.. మాట్లాడవచ్చు. కానీ.. తాజాగా నాగేశ్వర్ తీరు గమనిస్తే మాత్రం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్థాయిలో కనిపిస్తున్నాయి.
నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఆయనపై ఏపీలో పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో జర్నలిస్టుపై దాడి అంటూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సీనియర్లు అని చెప్పుకునే కొందరు జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టారు. కానీ.. ఆ ప్రెస్ మీట్ వేదికపై పెట్టిన భారీ బ్యానర్ మాత్రం.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా తయారు చేశారు. “తెలంగాణ గొంతుకపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంత కాలం?”.. అంటూ రాసుకొచ్చారు. నిజానికి రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు అయ్యింది. కానీ మీడియా ఛానళ్లు అన్నీ హైదరాబాద్ నుంచే నడుస్తున్నాయి. వాటిల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌లో సెటిల్ అయిన వారే ఉన్నారు. వారిలో చాలా మందిని తెలంగాణ జర్నలిస్టులుగా గుర్తిస్తూ ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా జారీ అయ్యాయి.
మరి అలాంటి తెలంగాణ వాదులు.. ఏపీ రాజకీయాల పైన ఎందుకు నోటికి వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడకపోతే.. ఆయా ఛానళ్లకు టీఆర్‌పీ రేటింగ్ రాదు. ఏపీలో పరిస్థితుల గురించి చర్చించకపోతే.. సో కాల్డ్ జర్నలిస్టులకు గుర్తింపు రాదు. అంతెందుకు.. ఏపీలో అధికారం చలాయించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇందిరా టెలివిజన్ సాక్షి టీవీ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. అందులో పని చేసే వారికి కూడా తెలంగాణ ప్రభుత్వమే గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. అయినా సరే.. సాక్షి టీవీలో నిరంతరం ఏపీ రాజకీయాల గురించే చూపిస్తారు.
ఇక అసలు విషయం ఏమిటంటే.. తెలంగాణ జర్నలిస్టులు.. ఆంధ్ర ఇనుప బూట్లు.. అని ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు సంఘీభావంగా బ్యానర్ పెట్టారు. అసలు ఎవరివి ఇనుప బూట్లు.. తెలంగాణ జర్నలిస్టులకు ఏపీ రాజకీయాలతో పనెందుకు అసలు..? ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు నోటికి వచ్చిన కామెంట్లు చేస్తూ ఉంటే.. చూస్తూ ఊరుకోవాలా.. అందుకే కేసులు పెట్టారు. అందులో తప్పేముంది. దమ్ముంటే.. చేసిన ఆరోపణలు నిజమని రుజువు చేయాలి.. లేదా.. తప్పు జరిగింది అని సారీ చెప్పాలి.. నాగేశ్వర్ తప్పు ఒప్పుకున్నాడు. ఇక ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఆయనపై ఎవరూ దాడి చేయలేదు. ఆయనే నన్ను అరెస్టు చేస్తారంట.. నాకు రక్షణ కల్పించండి సార్.. అంటూ తెలంగాణ డీజీపీని కలిసారు. పాత సామెత ఉన్నట్లుగా.. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. అన్నట్లుగా.. నోరు జారడమెందుకు.. ఇప్పుడు ఇలా ఏడవటం ఎందుకు..?
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఎవరూ కూడా నాగేశ్వర్‌తో పాటు మేథావులు అని చెప్పుకునే తెలంగాణ జర్నలిస్టులను బలవంతంగా టీవీ డిబేట్లలో కూర్చొబెట్టటం లేదు. మర్యాద పూర్వకంగా అడుగుతున్నారు.. ఒప్పుకుంటే సరి.. లేదంటే.. వారి స్థానంలో మరొకరు.. ఉద్యోగుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆంధ్ర ఇనుప బూట్లు ఏ ఒక్క తెలంగాణ గొంతు మీద లేవు. నచ్చితే పని చేస్తారు.. లేదంటే వెళ్లిపోతారు. నిన్నటి ప్రెస్ మీట్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీట్‌లో ఉన్న వారిలో చాలా మంది.. ఆంధ్ర ప్రాంత పారిశ్రామిక వేత్త స్థాపించిన ఈనాడు, ఈటీవీ సంస్థల నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల్లో పని చేసిన వారే ఎక్కువ. మరి అప్పుడు ఆంధ్ర ఇనుప బూట్లు అనే మాట గుర్తుకు రాలేదా..?
ఇరవై ఏళ్లుగా ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నేతలపై విమర్శలు విశ్లేషణలు చేస్తూ కెరీర్ నిర్మించుకున్న ఈ సో కాల్డ్ ప్రొఫెసర్ అనే వ్యక్తి.. ఇప్పుడు హఠాత్తుగా “ఆంధ్ర ఇనుప బూట్లు” అంటూ మొత్తం ప్రాంతాన్నే టార్గెట్ చేయడం నిజంగా సిగ్గు చేటు. “ఆధారాలు లేకుండా గాలి మాటలు నమ్మి మాట్లాడాను.. వాటిని విత్ డ్రా చేసుకుంటున్నాను” అని స్వయంగా ఒప్పుకున్న నాగేశ్వర్.. ఇప్పుడు తెలంగాణ భావోద్వేగాలపై బూజు పట్టిన ప్రాంతీయ భావజాలాన్ని ఎందుకు రుద్దుతున్నారో.. దాని వెనుక ఎవరున్నారనే విషయం లోతుగా పరిశీలించాల్సిందే.
అసలు నాగేశ్వర్ చేసిన తప్పు వ్యాఖ్యలకు తెలంగాణ సామాన్య ప్రజలకు ఏమిటి సంబంధం..? చేసిన ఆరోపణలు తప్పని ప్రజలు ప్రశ్నిస్తే.. వెంటనే “తెలంగాణపై దాడి”, “ఆంధ్ర ఇనుప బూట్లు” అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమా..? భావ ప్రకటన స్వేచ్ఛ మీకేనా? తెలుగుదేశం – జనసేన అభిమానులకు ఉండదా..? మీరు ఏ పార్టీపై అయినా, ఏ నేతపై అయినా ప్రతిరోజూ విమర్శలు చేయొచ్చు.. కానీ మీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే మాత్రం డీజీపీ వద్దకు వెళ్లి ఫిర్యాదులా?.. మీ దగ్గర ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేయడం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అయితే.. మిమ్మల్ని వైసీపీ పేటీఎం వ్యక్తి అంటున్న వాళ్లది కూడా అదే ఫ్రీడమ్ కాదా..? వాళ్లకు ఫ్రీడమ్ లేకుండా పోతుందా..?
నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ యూట్యూబ్‌లోకి రానంత వరకూ బాగానే ఉన్నారు. లాజికల్‌గా విశ్లేషించేవారు. అందుకే ఆయన విశ్లేషణలకు అంత క్రేజ్. ఎప్పుడైతే ఆయన యూట్యూబ్‌లోకి వచ్చారో.. అప్పటి నుంచి సెన్సేషనలిజమ్‌కి అలవాటు పడ్డారు. వ్యూస్ కోసం పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే ఆయన చానల్లో కొన్ని చౌకబారు వీడియోలు కనిపిస్తాయి. అవి ఆయన స్థాయికి తగినవి కావు. అయినా వాటిని ఆయన టచ్ చేశారంటే కారణం.. కేవలం వ్యూస్ కోసమే. ఇప్పుడు జనసేన ఎపిసోడ్ కూడా వంద శాతం వ్యూస్ కోసం చేసిందే. చానళ్లలో డిబేట్లకు వెళ్లే ముందు ఫలానా టాపిక్ పైన ఇలా అడుగు.. అలా అడుగు.. అని ఆయనే గైడ్ చేస్తూ ఉంటారట. అంటే అది ప్రీ ప్లాన్డ్ అని అర్థమవుతుంది. ఇది కూడా అలాంటిదే అనుకోవాలి.
కానీ జనసేన నుంచి ఈ స్థాయిలో కౌంటర్ వస్తుందని ఊహించలేదు. ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ ఏకంగా అఫిషియల్ వాల్ పైనే ఆయనకు వైసీపీ కండువా కప్పి ప్రచారం చేసింది. ఇక ఎప్పుడైతే జనసైనికులు కేసు పెట్టారో.. దెబ్బకు నాగేశ్వర్ వణికిపోయారు. ఆగమేఘాల పైన సారీ చెప్పేసారు. అది కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న విధంగా సాష్టాంగపడి క్షమించమని కోరారు. నిజంగా ఆయన దగ్గర కచ్చితమైన సోర్స్ ఉంటే.. సారీ చెప్పాల్సిన పని లేదు. తన మాటకు తాను కట్టుబడి ఉండొచ్చు. కేసులకు భయపడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ అలా చేయలేకపోయారంటే.. ఆయన వ్యూస్ కోసం నోటికొచ్చినట్లు వాగారంతే..!
ఇప్పటికైనా మేథావుల ముసుగు వేసుకున్న జర్నలిస్టులు దిగజారుడు చర్యలు ఆపాలి. ప్రాంతీయ విద్వేషాలతో తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఆపాలి. కావాలంటే రోజు ఆంధ్ర పార్టీలు అన్నిటినీ గట్టిగా విమర్శించుకోండి. అంతే గానీ ఆంధ్ర, తెలంగాణ అనే అలగా మాటలు మాట్లాడకండి.. అని రెండు రాష్ట్రాల్లో ఉన్న శాంతి కాముకులైన ప్రజలు కోరుకుంటున్నారు.
