సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒకటే పేరు ఉంటుంది. మరో పేరు పెట్టుకున్నారు అంటే.. చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది. సాధారణంగా ఇలా పేర్లు మార్చుకునేది నేరస్తులు మాత్రమే. ఆర్థిక నేరం చేసి ఊరి నుంచి పారిపోయిన వాళ్లు, హత్యలు చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండేందుకు, జైలు నుంచి తప్పించుకున్న వారే ఇలా పేర్లు మార్చుకుంటారు. కానీ.. ఒక వ్యక్తి మాత్రం.. 2024 ఎన్నికల ముందు ఒక పేరుతో చలామణి అయితే.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి మరో పేరు పెట్టుకున్నారు. ఇలా ఎందుకు అని ఆరా తీస్తే.. ఈ సారు అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది.
అసలు పేరు దండా వీరారెడ్డి.. ఇది ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది. కానీ నిన్నటి వరకు ఈ పెద్ద మనిషి ముసుగు వేసుకున్న వ్యక్తి పేరు లోకేష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మేడికొండూరు ఈ వీరారెడ్డి స్వగ్రామం. వ్యాపారం కోసం హైదరాబాద్ వెళ్లిపోయాడు. 2019 వరకు అక్కడే ఉన్నాడు. లిక్కర్, రియల్ ఎస్టేట్ అంటూ ఏవేవో వ్యాపారాలు చేశాడు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. సార్ అడ్రస్ కేరాఫ్ తాడేపల్లి. ఐదేళ్లు తాడేపల్లి నుంచే వ్యవహారాలు కొనసాగించాడు. ఇంకా చెప్పాలంటే.. వందల కోట్లు సంపాదించాడు. ఇందుకు రుజువులు ఆయన పేరుతో పాటు భార్య పేరుతో ఉన్న ఆస్తులే. సరిగ్గా 2024 ఎన్నికల ముందు ఈ పెద్దమనిషికి సినిమా అర్థమైంది. వైసీపీ ఓటమి ఖాయమని తెలుసుకున్న వీరారెడ్డి సైలెంట్‌గా మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయాడు. పేరు మార్చుకున్నాడు.. టీడీపీ నేతలకు టచ్‌లోకి వచ్చాడు.
అసలు ఎవరీ దండా వీరారెడ్డి.. పేరు ఎందుకు మార్చుకున్నాడు.. అనే విషయాలు ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీరారెడ్డి ప్రస్తుత పేరు లోకేష్ రెడ్డి. ఈయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కె.నాగేశ్వరరెడ్డి అలియాస్ కేఎన్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కేఎన్‌ఆర్‌కు అనుచరుడిగా ఉంటూ కుటుంబ సభ్యుల పేర్ల మీద భారీగా బినామీ ఆస్తులు కూడబెట్టారనేది ప్రస్తుతం వీరారెడ్డి పైన ఉన్న ఆరోపణలు. ముఖ్యంగా భార్య దండా బిందు మాధవి పేరుపై చాలా స్థిరాస్తులు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ముందు రాజకీయ నేతలే ఈ యవ్వారంలో ఉన్నారనుకున్నారు. కానీ తర్వాతే తెలిసింది.. ఇందులో ఉన్నదంతా.. బినామీలే అని. కింగ్ పిన్ కోసం వేట మొదలుపెట్టిన తర్వాత.. రెండేళ్లకు కేఎన్ఆర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేఎన్ఆర్ గురించి ఆరా తీస్తే.. వీరారెడ్డి బాగోతం బయటపడింది. ఒక వైన్ షాపుతో మొదలైన వీరారెడ్డి వ్యాపారం.. వందల కోట్లకు ఎలా చేరిందో తెలుసుకుంటున్నారు సిట్ అధికారులు. ఇటీవల హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేటలో కేఎన్ఆర్, దండా వీరారెడ్డి కలిసి ప్రీమియం నివాస ప్లాటు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో దండా వీరారెడ్డికి గన్ లైసెన్స్ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి కేఎన్ఆర్ ఈ లైసెన్స్ ఇప్పించినట్లు సమాచారం.
అయితే ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఈయన తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చారని సమాచారం. ఇక్కడే అసలు కథ మొదలైంది. వీరారెడ్డి కాస్త ఇప్పుడు లోకేష్ రెడ్డి అయ్యారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. సదరు వీర లోకేష్ రెడ్డిని కాపాడుతోంది.. ఏపీకి చెందిన ఓ మహిళా మంత్రి అని ఆరోపణలు. సదరు మంత్రి గారు విజయవాడ నుంచి హైదరాబాద్ రాకపోకలన్నీ వీర లోకేష్ రెడ్డి కారులోనే జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో గెస్ట్ హౌస్ సహా మేడం గారి సకల సౌకర్యాలన్నీ కూడా వీర లోకేష్ రెడ్డి సమకూరుస్తున్నట్లు భోగట్టా. ఏడాదిన్నరగా వీర లోకేష్ రెడ్డిని కాపాడింది మేడం గారే. ఇతనిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన కూడా.. మేడం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కేఎన్ఆర్ వ్యవహారం బయటకు రావడం.. ఈ చైన్ లింక్ వీరారెడ్డి అలియాస్ లోకేష్ రెడ్డికి తగలటంతో.. మేడం సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ మంత్రి గారిపైన అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి కాదు. రెండేళ్ల పదవీ కాలంలో.. ఎక్కువ ఆరోపణలు వచ్చింది మేడం పైనే. మేడం గారి అవినీతి చరిత్ర గురించి టీడీపీ అనుకూల మీడియాలోనే వరుస కథనాలు వచ్చాయి. నిధుల దుర్వినియోగం, వ్యాపారులపై వేధింపులు, ఉద్యోగుల బదిలీల్లో చేతి వాటం.. ఇలా ఒకటేమిటి.. చాలా అంటే చాలానే ఉన్నాయి. మరి ప్రభుత్వ, పార్టీ పెద్దలు మేడం గారి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
