ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కర్ణాటక కోటా నుండి దక్కాల్సిన రాజ్యసభ సీటు సడన్‌గా చేజారిపోవడం దేశరాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. హైకమాండ్ నుండి పక్కా హామీ లభించినప్పటికీ చివరి నిమిషంలో ఆమె పేరు జాబితా నుండి మాయమవ్వడం వెనుక ఢిల్లీ స్థాయిలో ఒక భారీ అంతర్గత చక్రవ్యూహం నడిచిందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తెరవెనుక సన్నిహిత సంబంధాలు కలిగిన కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలే దీనికి స్కెచ్ వేశారనే టాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయ వర్గాల లీకుల ప్రకారం.. ఏఐసీసీ (AICC) లోని ఒక శక్తివంతమైన కోటరీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులైన కొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వైఎస్సార్ కాలం నుండి ఢిల్లీలో ఉన్న ఈ పాత తరం కాంగ్రెస్ నేతలు, జగన్ ఏపీలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఆయనతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ను బతికించడం కంటే, జగన్‌కు ఇబ్బంది కలగకుండా చూడటమే ఈ గ్రూప్ ప్రధాన వ్యూహంగా పెట్టుకుందనే ఊహాగానాలు ఉన్నాయి. షర్మిల రాజ్యసభకు వెళ్తే ఆమె ఢిల్లీ వేదికగా జగన్‌పై మరింత దూకుడుగా పొలిటికల్ అటాక్ చేస్తుందని, అది జగన్ రాజకీయ భవిష్యత్తుకు నష్టమని భావించిన ఈ ‘ఢిల్లీ పెద్దలు’.. ఆమెకు సీటు రాకుండా లోపాయకారీగా అడ్డుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
షర్మిలను దెబ్బకొట్టడానికి ఈ సీనియర్ల గ్రూప్ చాలా వ్యూహాత్మకంగా కర్ణాటక స్థానిక సెంటిమెంట్‌ను వాడుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన ముగ్గురు అభ్యర్థుల ఎంపికలో మల్లికార్జున ఖర్గే, మన్సూర్ అలీ ఖాన్‌లతో పాటు మూడో సీటును పవన్ ఖేరాకు కేటాయించారు. అయితే మొదట్లో షర్మిలకే ఈ సీటు దాదాపు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. కానీ “కర్ణాటక నుండి పరాయి రాష్ట్ర నేతలను పంపితే స్థానిక క్యాడర్ అసంతృప్తికి లోనవుతుంది, పైగా ఇప్పటికే ఆమె ఏపీలో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు” అనే నివేదికలను రాహుల్ గాంధీ, ఖర్గేల వద్దకు చేర్చడంలో ఈ జగన్ అనుకూల వర్గం సక్సెస్ అయిందని టాక్. స్థానిక సమీకరణాల నెపంతో షర్మిల ఫైల్‌ను క్లోజ్ చేయించి, పవన్ ఖేరా పేరును తెరపైకి తెచ్చి ఆమెకు గట్టి షాక్ ఇచ్చారని అనుకుంటున్నారు.
సొంత పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన ఆ ‘సీక్రెట్ లీడర్స్’ ఎవరు అనే దానిపై ఇప్పుడు షర్మిల వర్గం ఆరా తీస్తోంది. రాహుల్ గాంధీని నేరుగా కలిసి మాట్లాడినప్పటికీ చివరి నిమిషంలో ఇలా హ్యాండ్ ఇవ్వడం వెనుక పార్టీలోని పెద్ద తలకాయల హస్తం ఉందని ఆమె నమ్ముతున్నట్లు సమాచారం. ఈ రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా, ఢిల్లీ కాంగ్రెస్‌లోని కొందరు నేతలు జగన్ ప్రయోజనాల కోసమే షర్మిల ఎదుగుదలకు బ్రేకులు వేశారనే ఈ సరికొత్త ఊహాగానాలు ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత విబేధాలను రోడ్డున పడేస్తున్నాయి. మరి ఈ ఢిల్లీ రచ్చపై వైఎస్ షర్మిల ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి