దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ (NEET) పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై విద్యార్థి లోకం, ప్రతిపక్షాలు ఉమ్మడిగా చేపట్టిన పోరాటం తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వ్యాప్తంగా హై-అలర్ట్ ప్రకటించింది. నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తుండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలోని అత్యంత కీలకమైన 16 మెట్రో స్టేషన్లను అధికారులు ముందు జాగ్రత్తగా తాత్కాలికంగా మూసివేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మరియు ఆందోళనకారులు గుంపులు గుంపులుగా ఒకే చోటికి చేరకుండా అడ్డుకోవడానికి కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, ఉద్యోగ్ భవన్ వంటి అత్యంత రద్దీగా ఉండే కీలక మెట్రో స్టేషన్ల గేట్లను అధికారులు పూర్తిగా క్లోజ్ చేశారు. దీంతో సాధారణ ఆఫీసు ఉద్యోగులు, సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో స్టేషన్ల వెలుపల భారీగా పోలీసులు, పారామిలట్రీ బలగాలు మోహరించాయి.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసనలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా మద్దతు ప్రకటించి, ప్రధానమంత్రి నివాస ముట్టడికి పిలుపునివ్వడంతోనే ఢిల్లీలో ఈ రేంజ్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రజా రవాణాను స్తంభింపజేయడం ద్వారా ఉద్యమకారులు పీఎం హౌస్ వైపు దూసుకుపోకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల మూసివేతతో పాటు ప్రధాన కూడళ్లలో బారికేడ్లు వేసి, ఇంటర్నెట్ సేవలపై కూడా నిఘా పెట్టారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, ఇలా మెట్రో స్టేషన్లను మూసివేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం.. కేంద్రం ఎంతగా భయపడుతుందో నిరూపిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు ధ్వజమెత్తాయి. ఢిల్లీని ఎంతగా దిగ్బంధించినా, విద్యార్థుల భవిష్యత్తు కోసం సాగే ఈ పోరాటాన్ని అణచివేయడం ఎవరి తరం కాదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి