దేశ రాజధాని ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు ఉధృతమైన ఆందోళనలు చేస్తున్న తరుణంలో.. ఈ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను ప్రధాని మోదీ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా భుజాలపై పెట్టారు. సాధారణంగా ఇలాంటి క్లిష్ట సమయాల్లో హోం మంత్రి అమిత్ షా వంటి దూకుడు ఉన్న నేతలు రంగంలోకి దిగుతుంటారు. కానీ, అందుకు భిన్నంగా మోదీ.. జేపీ నడ్డాను ఎంచుకోవడం వెనుక ఆయనకున్న ప్రత్యేకమైన రాజకీయ, వ్యక్తిగత శైలియే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాట్నాలో జన్మించిన జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ (BJP) లో వివాదరహిత నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎప్పుడూ పెద్దగా మాట్లాడరని, తెరవెనుక ఉండి నిశ్శబ్దంగా వ్యూహాలు రచించడానికే ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఎంతటి కఠినమైన లేదా భిన్నమైన వ్యూహాలు కలిగిన వారినైనా సరే ఎంతో ఓపికగా వినడం నడ్డా గారి ప్రత్యేకత. తాజాగా ఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులను తన నివాసానికి పిలిపించుకుని, వారికి ఎంతో మర్యాదగా టీ, స్నాక్స్ ఇచ్చి, వారి డిమాండ్లను చాలా ప్రశాంతంగా విన్నారు.
విచిత్రమేమిటంటే.. వారు అడిగిన డిమాండ్లను వేటినీ అంగీకరించకుండానే, ఎలాంటి హామీ ఇవ్వకుండానే నిరసనకారులను నవ్విస్తూ వెనక్కి పంపడంలో జేపీ నడ్డా తన మార్క్ రాయబారాన్ని ప్రదర్శించారు. జేపీ నడ్డా కేవలం ఒక మంత్రి లేదా బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా.. ఒకప్పుడు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు కావడం కూడా ఇక్కడ కలిసి వచ్చింది. 1975లో జేపీ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, 1977లో పాట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ఏబీవీపీ (ABVP) లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అందువల్ల, ఆందోళన చేస్తున్న నేటి తరం విద్యార్థుల మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి ఆగ్రహాన్ని ఎలా శాంతింపజేయాలి అనేది ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా ఆయనకు ఉన్న అనుభవం ప్రభుత్వానికి బాగా ఉపయోగపడింది. నీట్ పరీక్షల అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆయన ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ పరిధిలోనే ఉండటంతో, సమస్యను సామరస్యంగా డీల్ చేస్తూ కేంద్రానికి నడ్డా రక్షణ వలయంగా నిలిచారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి