కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమ స్ఫూర్తితో ఇప్పుడు సోషల్ మీడియాలో “E20 జనతా పార్టీ” అనే ఒక కొత్త గ్రూప్ తెరపైకి వచ్చింది. మోడీ ప్రభుత్వంలో అత్యంత విజయవంతమైన మంత్రిగా పేరు తెచ్చుకున్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఈ గ్రూప్ నేరుగా టార్గెట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. “ధర్మేంద్ర ప్రధాన్ గయా.. ఈజ్ నితిన్ గడ్కరీ నెక్స్ట్?” అంటూ సోషల్ మీడియాలో నితిన్ గడ్కరీ రాజీనామాను డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న E20 (20 శాతం ఇథనాల్ కలిపిన) ఇంధన విధానం. పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల తగ్గింపు పేరుతో ఈ ఇంధనాన్ని తప్పనిసరి చేయగా.. దీనివల్ల దేశంలోని కోట్లాది పాత వాహనాల ఇంజన్లు ఘోరంగా దెబ్బతింటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజ్ దారుణంగా పడిపోతోందని, ఇంజన్ల లోపలి భాగాలు తుప్పు పట్టి సామాన్య వాహనదారులు వేల రూపాయల రిపేర్ల భారంతో సతమతమవుతున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లీటర్ పెట్రోల్‌కు వంద రూపాయలకు పైగా చెల్లిస్తున్నా.. సామాన్యుడి సొంత వాహనాలు ఎందుకు నాశనం కావాలంటూ ప్రజల్లో తీవ్రమైన కోపం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యమం కేవలం ఇంటర్నెట్కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి నిరసనలకు సిద్ధమవుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఇండియా గేట్ వద్ద “గాడీ మార్చ్” (Gaadi March) పేరుతో భారీ వాహన ప్రదర్శన మరియు నిరసనకు ‘E20 జంతాపార్టీ’ పిలుపునిచ్చింది. దేశంలోని ప్రతి బైక్, కార్ ఓనర్‌కు ఈ సమస్య నేరుగా సంబంధం కలిగి ఉండటంతో.. ఈ నిరసనకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది. కోట్లాది మంది వాహనదారుల ఆగ్రహానికి కారణమైన ఈ E20 బలవంతపు విధానంపై నితిన్ గడ్కరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వం ఈ ఇంధన పాలసీపై వెనక్కి తగ్గుతుందా లేదా అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి