తెలంగాణ పోలీస్ శాఖ విఐపి (VIP) సెక్యూరిటీ మరియు ప్రభుత్వ వాహనాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెక్యూరిటీ రివ్యూ కమిటీ జరిపిన తాజా సమీక్ష ఆధారంగా.. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారితో పాటు రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ (BP) వాహనాలను తక్షణమే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 26 మంది ఉన్నతాధికారులకు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల సదుపాయాన్ని రద్దు చేయడం పోలీస్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కొత్త నిర్ణయం ప్రకారం కేవలం రిటైర్డ్ అధికారులకే కాకుండా.. ప్రస్తుతం అత్యంత కీలక బాధ్యతల్లో ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్లతో పాటు కీలక విభాగాల అధిపతులకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాల సేవలను నిలిపివేశారు. గతంలో ఉన్న భద్రతా ముప్పు (Threat Perception) ఆధారంగా ఈ వాహనాలను కేటాయించారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంతటి స్థాయిలో ముప్పు లేదని నిర్ధారించుకున్నాకే వీటన్నింటినీ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం తగ్గనుంది.
వాహనాలే కాకుండా, పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పోలీస్ అధికారుల వ్యక్తిగత భద్రతపై కూడా పోలీస్ శాఖ గట్టి నిఘా పెట్టింది. అనవసరంగా ఎక్కువ మంది గన్‌మెన్లను ఉంచుకుని హోదాగా ఫీలవుతున్న వారికి షాక్ ఇస్తూ.. మొత్తం 67 మంది ప్రముఖుల గన్‌మెన్ల సంఖ్యను భారీగా తగ్గించింది. ఎవరికైతే నిజంగా ప్రాణాపాయం లేదా భద్రతా సమస్యలు ఉన్నాయో, వారికి మాత్రమే అవసరమైన మేర సెక్యూరిటీని ఉంచి, మిగిలిన అదనపు బలగాలను వెంటనే విధుల్లోకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి