తాజా వార్తలు

RRR: జగన్ ఢిల్లీ టూర్… అవినాష్ కోసమే!

షర్మిళకు ప్రాణహాని... రక్షణ కోరాలి: రఘురామ కృష్ణంరాజు

Share this :

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెనుక మనసులో ఉన్న ఉద్దేశం ఒకటైతే, పైకి చెప్పేది మాత్రం మరొకటని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలుసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు ఆయనకు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ దొరకలేదు. విభజన సమస్యల పరిష్కారానికి, ప్రత్యేక హోదా సాధనకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కోరడానికి మాత్రమే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని సాక్షి మీడియాతో పాటు, దాని అనుబంధ నీలి చానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి వారిని కలిసిన తర్వాత మీడియాకు కూడా ఇదే విషయాన్ని చెబుతారు. అయితే ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు… అయితే గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా అపాయింట్మెంట్ దొరికినా దొరకవచ్చునేమో కానీ ఆయన కలుస్తున్న ప్రయత్నం నిజం కాదు. అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి రంగులన్నీ బయటపడ్డాయి. ఫిబ్రవరి 5వ తేదీన సుప్రీం కోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెద్దలను కలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఒకటి అయితే, పైకి మాత్రం మరొకటి చెబుతారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. అలాగే, పొత్తు పొడుపును ఎలాగైనా అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కానీ పొత్తు పొడుపు అన్నది జరుగుతుందనేది నా ఆశ, కోరిక, ఆశయం కూడా అని రఘు రామకృష్ణంరాజు స్పష్టం చేశారు.

కూటమితో బీజేపీ పొత్తు కు వ్యతిరేకంగా సాక్షి దినపత్రికలో వార్త కథనాన్ని ప్రచురించడం పరిశీలిస్తే, పొత్తు కంపల్సరీ కుదురుతుందనేది నా నమ్మకం. దేశంలో సుస్థిరత ప్రభుత్వమే ఏర్పాటు లక్ష్యంగా భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి వెళ్లాలని నిర్ణయించిన బిజెపి నాయకత్వం, గతంలో తమను మోసగించిన నితీష్ కుమార్ తో మళ్ళీ దోస్తీ కట్టేది లేదని గతం లో తేల్చి చెప్పింది. కానీ మళ్ళీ బీహార్లో నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టింది. కర్ణాటక ఎన్నికల్లో ఒకరిని ఒకరు నిందించుకున్నప్పటికీ, కుమారస్వామిని ఎన్డీఏలోకి ఆహ్వానించారు. అద్భుత దేశాన్ని నిర్మించాలని, రాష్ట్రాలన్నీ సుభిక్షంగా ఉండాలంటూ కోరుకుంటున్న బిజెపి నాయకత్వం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దుర్భిక్షంలోకి నెట్టి వేయబడిన ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా అధికారంలో నుంచి దించి వేయాలని భావిస్తుంది. ప్రజా సౌభాగ్యాన్ని కోరుకునే పార్టీ, అద్భుత విజయం సాధించబోయే కూటమితో జత కడుతుందనే నేను ఆశిస్తున్నాను. అయినా కూటమిలోని ఒక పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం గమన్హారం. భాగస్వామ్య పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, గతంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలనే ఉద్దేశంతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేస్తుందని భావిస్తున్నాను. ఈ చెలిమి కొనసాగాలన్నదే నా భావన అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ దొరకకపోతే నేను చెప్పిందే నిజమని అభిప్రాయం అందరిలోనూ వస్తుంది. అందరికీ తెలిసిన నిజాలను నోటిలోని నొక్కి పెట్టడం మంచిదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు.

సాక్షిలో సగం వాటా నాదేనని షర్మిల చేసిన వ్యాఖ్యలపై అందుకే సగం పేజీలను ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడే వార్తలను ప్రచురిస్తున్నామని సాక్షి యాజమాన్యం చెప్పినట్లుగా ఈనాడు దినపత్రికలో వేసిన కార్టూన్, సాక్షి యాజమాన్య ఆలోచన ధోరణిని తెలియజేస్తోంది. వైయస్ షర్మిల కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం, ఎక్స్ వేదికగా ట్వీట్లు చేయడం, మంత్రి రోజా ఏకంగా ప్యాక్ చేస్తామని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించిన రఘురామకృష్ణంరాజు, షర్మిల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అనంత బాబు అనే ఎమ్మెల్సీ తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న దళితుడు అయిన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి శవాన్ని పార్సిల్ చేశారని గుర్తు చేశారు. ఇక పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో హత్య చేసిన అనంతరం ఊరిలోని బ్యాండేజీ అంతా పోగు చేసి ప్యాక్ చేశారని పేర్కొన్నారు. ప్యాకేజీ సర్వీసులో వైకాపా నాయకులు దిట్ట అని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న రోజా చేసిన హెచ్చరికలను షర్మిల తీవ్రంగా తీసుకోవాల్సిందేనని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే అదనపు రక్షణ కల్పించాలని ఆమె కోరాలి. జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు 600 మందితో రక్షణ కల్పించే ఏర్పాట్లను చేసుకున్నారు. తనతో పాటు తన భార్యకు, విదేశాలలో విద్యాభ్యాసం చేస్తున్న కూతుళ్లకు, తనకు దూరంగా ఉంటున్న తల్లికి ప్రజాధనంతో రక్షణ ఏర్పాట్లను చేసుకున్న ఆయన, చెల్లికి రక్షణను కల్పించకపోగా, బావకు ఉన్న రక్షణ సిబ్బందిని తొలగించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ రక్షణ నిమిత్తం 200 నుంచి 300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లండన్ లో అక్కడి ప్రధాన మంత్రికి లేని సెక్యూరిటీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూతురుకు కల్పించడం విడ్డూరం. మరో రెండు నెలపాటు ప్రజలు ఈ ఖర్చును భరించక తప్పదు. అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత దోచుకున్న సొమ్ము లో నుంచి డబ్బులు ఖర్చు చేసి కూతుళ్లకు సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయిస్తారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తనది కాకపోతే ఏమైనా చేయవచ్చుననే ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.