ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాయలసీమ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇటీవలి కాలంలో వెనుక బలమైన రాజకీయ, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయనే మాట బలంగా వినపడుతోంది. సాధారణంగా రాయలసీమ అనగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కోట అనే ముద్ర ఉండేది. అయితే, 2024 ఎన్నికల్లో కూటమి సాధించిన అఖండ విజయం ఇచ్చిన ఊపుతో, రాబోయే 2029 ఎన్నికల నాటికి సీమ రాజకీయాలను శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ (TDP) వైపు తిప్పుకోవడమే లోకేష్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇందులో భాగంగానే పారిశ్రామిక పెట్టుబడులను అస్త్రంగా వాడుకుంటూ, పొలిటికల్ నంబర్స్‌ను మార్చేందుకు లోకేష్ సరికొత్త స్కెచ్ వేశారు. రాయలసీమ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత 2019 ఎన్నికలలో ఈ 52 స్థానాలకు గానూ వైసీపీ ఏకంగా 49 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయగా, టీడీపీ కేవలం 3 స్థానాలకే.. అంటే కుప్పం, హిందూపురం, ఉరవకొండకు పరిమితమై కుప్పకూలిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి వీచిన గాలికి సమీకరణాలు పూర్తిగా మారిపోయి, సీమలోని 52 స్థానాలకు గానూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 45 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.
వైసీపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. నారా లోకేష్ ప్రస్తుత ఫోకస్ అంతా 2029 నాటికి సీమలో వైసీపీకి మిగిలిన ఆ 7 స్థానాలను కూడా తుడిచిపెట్టి 52 కి 52 స్థానాలు కూటమి ఖాతాలో వేయడమే. రాయలసీమలో ఎప్పుడూ ఉండే ప్రాంతీయ అసంతృప్తిని, కరువు ముద్రను చెరిపేయడానికి లోకేష్ ‘పెట్టుబడుల’ అస్త్రాన్ని ఎంచుకున్నారు. సీమ యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లకుండా.. పుట్టపర్తిలో డీఆర్‌డీఓ (DRDO) డిఫెన్స్ ప్రాజెక్ట్, కడప జమ్మలమడుగులో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్, నంద్యాల-కర్నూలులో 850 ఎకరాల్లో MSME పార్కుల వంటి పారిశ్రామికాభివృద్ధిని లోకేష్ చూపిస్తున్నారు.
పరిశ్రమల ద్వారా వచ్చే లక్షలాది ఉద్యోగాల భరోసాతో, సీమలోని దాదాపు 40 లక్షల మంది యువ ఓటర్లను శాశ్వతంగా టీడీపీ వైపు తిప్పుకోవాలనేది లోకేష్ మాస్టర్ ప్లాన్. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడి తర్వాత పార్టీ వారసుడిగా తన లీడర్‌షిప్‌ను నిరూపించుకోవడానికి, వైసీపీ సొంత గడ్డపైనే వారిని కోలుకోలేని దెబ్బతీయడానికి లోకేష్ ఈ వ్యూహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు.
