తాజా వార్తలు

కేంద్ర కేబినెట్‌లోకి రాఘవ్ చడ్డా..? పొలిటికల్ లెక్కలు ఇవేనా..?

కేంద్ర కేబినెట్‌లోకి రాఘవ్ చడ్డా..?

Share this :

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పునాదులను కదిలిస్తూ రాజ్యసభ డిప్యూటీ లీడర్ రాఘవ్ చడ్డా కాషాయ జెండా కప్పుకోవడం జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కేవలం ఆయనొక్కరే కాకుండా, రాజ్యసభలో ఆప్‌కు ఉన్న సంఖ్యాబలాన్ని పూర్తిగా మార్చేస్తూ ఒక పక్కా ప్లాన్‌తో ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. ఈ మెగా సక్సెస్‌కు రివార్డుగా ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో రాఘవ్ చడ్డాకు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోందనే ఊహాగానాలు విని పిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల మాస్టర్ ప్లాన్ మరియు పొలిటికల్ నంబర్ల వ్యూహం దాగి ఉన్నాయి.

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎంపీలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే కనీసం మూడింట రెండొంతుల (2/3 వంతు) మంది సభ్యులు వేరే పార్టీలో విలీనం కావాల్సి ఉంటుంది. రాఘవ్ చడ్డా సరిగ్గా ఇదే లీగల్ రూట్‌ను ఎంచుకుని, తనతో పాటు సందీప్ పాతక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్ సహా మొత్తం 7 గురు ఎంపీలను ఒకేసారి బీజేపీ పార్లమెంటరీ పక్షంలో విలీనం చేశారు.

ఈ దెబ్బతో రాజ్యసభలో ఆప్ బలం కేవలం 3 స్థానాలకు పడిపోగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలం ఏకంగా 113 స్థానాలకు పెరిగి సభలో మరింత పటిష్ఠంగా మారింది. మరోవైపు 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌పై హోంమంత్రి అమిత్ షా గట్టిగా గురిపెట్టారు. గత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయగా, బీజేపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అప్పట్లో ఆప్ తరపున పంజాబ్ ఎన్నికల కో-ఇన్‌చార్జ్‌గా ఉండి, ఈ 92 సీట్ల భారీ విజయానికి వ్యూహాలు రచించింది రాఘవ్ చడ్డానే.

పంజాబ్ లోని ప్రతి నియోజకవర్గంలోనూ ఆప్ గెలుపు సూత్రాలు తెలిసిన అదే చాణక్యుడిని ఇప్పుడు తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఆప్ కోటను బద్దలు కొట్టవచ్చని అమిత్ షా ప్లాన్ చేశారు. రాఘవ్ చడ్డాకు కేంద్ర కేబినెట్ మంత్రి పదవి ఇవ్వడం ద్వారా, ఆయనకున్న యూత్ ఇమేజ్‌ను వాడుకుంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అక్కడ ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. గతంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి వచ్చినప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి అక్కడ పార్టీని ఎలా నిలబెట్టారో.. ఇప్పుడు పంజాబ్‌లోనూ రాఘవ్ చడ్డా నంబర్ల అండతో అదే ‘సింధియా ఫార్ములా’ను అమిత్ షా అప్లై చేస్తున్నారు. కేంద్ర మంత్రి హోదాలో చడ్డా పంజాబ్ అంతటా పర్యటిస్తూ ఆప్ వైఫల్యాలను ఎండగడితే, అక్కడ కాషాయ జెండా ఎగరడం ఖాయమని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.